కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షకుపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. అయితే.. ఇతర ప్రాంతాల నుంచి దేశంలోకి అడుగుపెట్టిన వారి కారణంగానే దేశంలో కరోనా వ్యాప్తి మొదలైంది. 

చాలా మంది క్వారంటైన్ లో ఉండకుండా ఇష్టం వచ్చినట్లు తిరగడం వల్ల చాలా మందికి వ్యాపించింది. ఈ క్రమంలో.. ఓ వివాహిత మాత్రం కరోనా వైరస్ ని అరికట్టేందుకు కట్టుకున్న భర్తను సైతం ఇంట్లోకి రానివ్వలేదు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ఓ వ్యక్తి బంగారం పనులు చేస్తూ ఉంటాడు. పనుల నేపథ్యంలో నెల్లూరు నగరానికి వెళ్లిన ఆయన లాక్ డౌన్ కారణంగా అక్కడే ఇరుక్కుపోయాడు. నానా తిప్పలు పడి బుధవారం ఆయన స్వగ్రామానికి చేరుకున్నాడు.

అయితే.. అతనిని భార్య ఇంట్లోకి అనుమతించకపోవడం గమనార్హం. ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని.. ఆ తర్వాతే ఇంట్లో కి రావాలని షరతు పెట్టింది. కేవలం తన భర్త కారణంగా తన గ్రామ ప్రజలంతా అవస్థలు పడకూడదనే తాను అలా చెప్పానని ఆమె చెప్పడం గమనార్హం.

కాగా.. అంగన్ వాడీ కేంద్రంలో ఉండిపోయాడు ఆయన. వైద్య సిబ్బంది వచ్చి పరీక్షలు చేసి.. ఆయనకు కరోనా లేదని తేల్చడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.