అత్తవారింటిపై దాడి చేయడమే కాదు కట్టుకున్న భర్తపై హత్యాయత్నానికి పాల్పడిందో వివాహిత. మంగళగిరి కార్పోరేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మంగళగిరి : అత్తవారింటిపై దాడిచేయడమే కాదు కట్టుకున్న భర్తపై హత్యాయత్నానికి పాల్పడిందో వివాహిత. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గత నెలలోనే ఈ ఘటన చోటుచేసుకోగా పోలీసులు కేసు నమోదు చేయడంలేదంటూ బాధితుడు ఆందోళన వ్యక్తం చేసాడు. దీంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళగిరి కార్పోరేషన్ పరిధిలోని నిడమర్రులో గోపాలకృష్ణ, నాగలక్ష్మి దంపతులు నివాసముండేవారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు కొన్నాళ్లకే విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవలు జరగడంతో ఇక కలిసి వుండటం సాధ్యపడక వేరువేరుగా వుంటున్నారు. గోపాలకృష్ణ స్వగ్రామం నిడమర్రులో, నాగలక్ష్మి తాడేపల్లిలోని పుట్టింట్లో వుంటోంది.
అయితే భార్యతో ఇక కలిసిబ్రతకడం ఇష్టంలేని గోపాలకృష్ణ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ వివాదం కోర్టులో నడుస్తుండగానే భార్య తన ఇంటిపై దాడిచేసి బంగారం, నగదు దోచుకెళ్లినట్లు గోపాలకృష్ణ ఆరోపిస్తున్నాడు. భార్య నాగలక్ష్మి బంధువులు సరోజిని, వర్ధన్, వంశీలతో కలిసి ఆగస్ట్ 18న అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిందని... తనపై దాడిచేసి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసారని ఆరోపించారు.
Read More అనుమానంతో నిత్యం వేధింపులు .. ఓపిక నశించి, భర్త అడ్డు తొలగించుకోవాలని
ఇంటిపై జరిగిన దాడి గురించి మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గోపాలకృష్ణ అంటున్నాడు. పోలీసులు మాత్రం భార్యాభర్తలు రాజీ చేసుకుంటామని కోరడంతోనే కేసు నమోదు చేయలేదని అంటున్నారు. తాజాగా రాజీ కుదరలేదని తెలిసి బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం గోపాలకృష్ణ ఇంటిపై దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు మంగళగిరి పోలీసులు తెలిపారు.
