కూతiరికి ఘనంగా పెళ్లి చేసి పంపించారు. కూతురు అత్తారింటికి కూడా వెళ్లిపోయింది. అయితే.. కూతురి పెళ్లి విషయంలో తల్లీ,తండ్రి గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్త ఒకరిని మరొకరు చంపుకునేదాకా వచ్చింది. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గురంధరపాలెం మండలం నర్సీపట్నం గ్రామానికి చెందిన విసారపు చిరంజీవి(48) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య సన్యాసమ్మ(40), కూతురు ఉన్నారు. ఇటీవల కూతురికి పెళ్లి చేశారు.  లాక్ డౌన్ లోనూ ఎలాంటి ఆటంకం కలగ కుండా పెళ్లి చేశామని వారు ఆనంద పడ్డారు. కూతురిని అత్తారింటికి పంపి తమ బాధ్యత తీరిందని సంబరపడ్డారు. అయితే.. ఆ సంబంరం ఎక్కువ సేపు నిలవలేదు. పెళ్లి సంబరాల గురించి మాట్లాడుతూ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అల్లుడి కులం విషయంలో ఆ ఇద్దరు భార్యభర్తల మధ్య గొడవ నెలకొంది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన సన్యాసమ్మ ఆవేశంలో భర్తను చంపేసింది. అనంతరం తానే నేరం చేశానంటూ పోలీసుల ముందు లొంగిపోయింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.