ఒంగోలు: ప్రియుడిపై మోజులో ఓ మహిళ భర్తను మట్టుబెట్టింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. బేస్తవారిపేట మండలం మోక్షగుండంలో గత నెల 29వ తేదీన పాడుబడిన బావిలోని గోనెసంచీలో ఓ మృతదేహం కనపించింది. ఈ కేసులో నిందితులు బేస్తవారిపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో భర్తకు మద్యం తాగించి ప్రియునితో కలిసి భార్య హత్య చేసినట్లు గిద్దలూరు సీఐ సుధాకర్ రావు మీడియా సమావేశంలో చెప్పారు. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కొమరోలు మండలం అయ్యవారిపల్లెకు చెందిన ఉరియ మాలకొండయ్యకు 32 ఏళ్ల క్రితం లక్ష్మీదేవి అనే మహిళతో పెళ్లయింది. వారికి ఇద్దరు కుమారు, ఓ కూతురు ఉన్నారు. కూతురిని గొట్లగొట్టు గ్రామంలో కోళ్లఫారం నిర్వహిస్తున్న రవికి ఇచ్చి వివాహం చేశారు. మాలకొండయ్య దంపతులు ఇద్దరు కూడా అల్లుడి కోళ్లఫారం వద్ద ఆరు నెలలుగా కాపలా ఉంటున్నారు. 

ఆ క్రమంలో గొట్లగట్టు గ్రామానికి చెందిన శరవన్ కుమార్ తో లక్ష్మీదేవికి పరిచయం ఏర్పడి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. దాంతో భర్తను అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి పథక రచన చేసి. ఆ పథకంలో భాగంగా గత నెల 17వ తేదీన మోక్షగుండం పొలాల్లో పాడుబడిన బావి వద్దకు మాలకొండయ్యకు మద్యం తాగించి, ఆ తర్వాత ఉరేసి అతన్ని చంపేశారు. మృతదేహాన్ని గొనెసంచీలో కుక్కి బావిలో పడేశారు. 

పాడుబడిన బావిలోంచి దుర్వాసన వస్తుండడంతో ఈ నెల 29వ తేదీన గోనె సంచీలో మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి. ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి, శరవన్ కుమార్ వీఆర్వో ఎదుట లొంగిపోయారు. వారిని ఎస్సై టీ. బాలకృష్ణ శుక్రవారం అరెస్టు చేశారు.