తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. అయితే ఆమె కాల్ రికార్డింగ్స్ ద్వారా మృతుడిది హత్య అని తెలియడంతో బంధువులు, గ్రామస్తులు షాకయ్యారు.

వివరాల్లోకి వెళితే... సఖినేటిపల్లి మండలం ఉయ్యూరు మెరకకు చెందిన ఉప్పు ప్రసాద్‌కు కొన్ని సంవత్సరాల క్రితం ప్రశాంతితో వివాహం అయ్యింది. అయితే ఆమెకు అదే ప్రాంతానికి చెందిన చొప్పల్ల శివతో అక్రమ సంబంధం ఏర్పడింది.

ఈ క్రమంలో తన సుఖానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ప్రిశాంతి.. భర్తను హతమార్చాలని స్కెచ్ గీసింది. ప్రియుడు శివతో కలిసి ప్రసాద్‌కు నిద్రమాత్రలు ఇచ్చి చంపింది. ఈ నెల రెండో తేదీన అర్థరాత్రి 12.50 నిమిషాలకు అతడు చనిపోవడంతో సహజ మరణంగా భావించిన బంధువులు ఖననం చేశారు.

ఈ క్రమంలో ప్రసాద్ మరణించిన సుమారు 15 రోజుల తర్వాత ప్రశాంతి- శివల మధ్య హత్యకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంతి, శివలను అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.