Asianet News TeluguAsianet News Telugu

హంద్రీ నది ఒడ్డున సగం కాలిన మృతదేహం.. ప్రియుడితో కలిసి భార్యే.. దారుణంగా...

భర్తను చంపేస్తే.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ప్రేమికుడిని రెచ్చగొట్టడంతో అతను, తన స్నేహితుడితో కలిసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలులో జరిగింది. 

wife gets husband assassinated through lover over extramarital affair in kurnool
Author
First Published Dec 29, 2022, 8:14 AM IST

కర్నూలు : కర్నూలులోని హంద్రీనది ఒడ్డున వ్యక్తిని దారుణంగా హత్య చేసి మృతదేహానికి నిప్పంటించిన ఘటన  కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య కేసును పోలీసులు నాలుగు రోజుల్లో చేధించారు. మృతుడిని ఆమోస్ గా గుర్తించిన పోలీసులు హతుడి భార్య, ఆమె ప్రియుడే ఈ హత్యకు కారణమని తేల్చారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే...

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాలకు చెందిన ఆమోస్ అనే వ్యక్తి హత్య కేసులో..  అతడి భార్య అరుణ, ఆమె ప్రియుడు మొలకల సూర్య ప్రదీప్, స్నేహితుడు జీవన్ కుమార్ లను పోలీసులు నిందితులుగా తేల్చారు. ఈ మేరకు ఈ ముగ్గురిని కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం డీఎస్పీ కేవీ మహేష్ కుమార్,  సిఐ శంకరయ్య ఈ కేసుకు సంబంధించిన వివరాలను కర్నూలులోని కార్యాలయంలో వెల్లడించారు. షాకింగ్ విషయం ఏంటంటే ఆమోస్, అరుణలు ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయానికి అరుణ మైనర్. దీంతో ఆమోస్ మీద ఫోక్సో చట్టం నమోదయింది. ఈ చట్టం కింద ఆమోస్ జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు.

అరుణ మేజర్ అయిన తర్వాత ఇద్దరూ విడిగా కాపురం పెట్టారు. కర్నూలులోని ఉద్యోగ నగర్ లో ఓ ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు అఖిల్.. ఐదేళ్లవాడు. కర్నూలులోని సిటీ స్క్వేర్ మాల్ లో సెక్యూరిటీ గార్డుగా ఆమోస్ పని చేస్తున్నాడు. అరుణ అదే కాంప్లెక్స్ లోని ఓ బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. అయితే ఆమోస్ కు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ అలవాటు శృతి మించి ఆమోస్ నిత్యం మద్యం తాగి వచ్చి అరుణను వేధించేవాడు. 

హంద్రీ నది ఒడ్డున దారుణ హత్య, ఆపై డెడ్‌బాడీకి నిప్పు... పరువు హత్యగా అనుమానం..?

ములకల సూర్యప్రదీప్ వీరి ఇంటికి దగ్గరలోనే ఉండేవాడు. అతను సాయంత్రాలు ఆటో నడుపుతూ.. పొద్దున పూట ఓ ప్రైవేట్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసేవాడు. అవసరమైనప్పుడు ఆమోస్, అరుణలు ఇతని ఆటోను వాడుతుండేవారు.  ఈ క్రమంలో ఆమోస్, సూర్యప్రదీప్ లకు స్నేహం కుదిరింది. వీరిద్దరూ కలిసి  అప్పుడప్పుడు మందు తాగుతూ ఉండే వాళ్ళు. ఈ నేపథ్యంలోనే అరుణకు, సూర్యప్రదీప్ తో పరిచయం పెరిగి.. ఇద్దరి మధ్య ఇష్టంగా ప్రేమగా మారింది.

ఆ తరువాత అరుణ, సూర్యప్రదీప్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.  అయితే తాగుబోతు భర్తను అడ్డు తొలగిస్తే సూర్యప్రదీప్ ను పెళ్లి చేసుకుంటానని అరుణ తెలిపింది. దీంతో ఎలాగైనా అరుణను దక్కించుకోవాలని సూర్యప్రదీప్ పథకం పన్నాడు. ఆమోస్ ను చంపాలనుకున్నాడు. తన స్నేహితుడైన జీవన్ కుమార్ ను ఇందులో సాయం చేయమని కోరాడు. దీంతో వీరిద్దరూ కలిసి హత్యకు ప్లాన్ చేశారు.

దీని ప్రకారం ఈ నెల 22వ తేదీ రాత్రి మందు తాగుదామని చెప్పి ఆమోస్ ను సూర్యప్రదీప్, జీవన్ కుమార్ లు కలిసి శరీన్ నగర్ సవారీతోట హంద్రీ నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు మద్యం తాగారు. ఆమోస్ కు కాస్త ఎక్కువగానే తాగించారు.  ఆ తర్వాత తమ తో పాటు తెచ్చుకున్న ఫ్యాన్ రాడ్ తో అతని తలపై కొట్టి హత్య చేశారు. శవాన్ని ఎవరైనా గుర్తుపడితే తాము దొరికి పోతామని అలా కాకుండా ఉండాలని.. మృత దేహం మీద పెట్రోలు పోసి నిప్పంటించారు. అయితే, శవం పూర్తిగా కాలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక… మృతదేహాన్ని హంద్రీ నది ఒడ్డువరకు లాక్కెళ్లి అక్కడ పడేసి వెళ్లిపోయారు.

హత్యానంతరం అరుణకు ఫోన్ చేసిన సూర్యప్రదీప్ విషయం మొత్తం చెప్పాడు. అరుణ ఏమీ జరగనట్టుగానే ఊరుకుంది. అయితే, 24వ తేదీన హంద్రీనీవా నది ఒడ్డున సగంకాలిన గుర్తు తెలియని మృతదేహం దొరకడంతో కర్నూలు నాలుగో పట్టణ సిఐ శంకరయ్య  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే అనుమానంతో భార్య అయిన అరుణ విచారించడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios