కృష్ణా జిల్లాలో విషాదం: కరోనాతో దంపతుల ఆత్మహత్య, అనాథలైన పిల్లలు

ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ సోకడంతో మనస్తాపానికి గురైన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి పిల్లలు దిక్కు లేనివారయ్యారు.

Wife and husband, infected with Coronavirus, commit suicide in Krishna district

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ సోకిన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. కృష్ణా జిల్లా పెడనలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ప్రసాద్, భారతి దంపతులకు పది రోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. వారు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే, కరోనా వైరస్ తమకు తగ్గదని మనస్తాపానికి గురైన భార్యాభర్తలు ఇంట్లో ఉరి వేసుకుని మరణించారు. దాంతో వారి ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతూనే వుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 22,610 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 15,21,142కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 114 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 9800కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 9, అనంతపురం 9, తూర్పుగోదావరి 10, చిత్తూరు 15, గుంటూరు 10, కర్నూలు 7, నెల్లూరు 5, కృష్ణ 8, విశాఖపట్నం 10, శ్రీకాకుళం 6, పశ్చిమ గోదావరి 17, ప్రకాశం 5,  కడపలో ఇద్దరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 22,610 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 13,02,208కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 23,098 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,83,42,918కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,09,134 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1794, చిత్తూరు 3185, తూర్పుగోదావరి 3602, గుంటూరు 1584, కడప 989, కృష్ణ 1084, కర్నూలు 1178, నెల్లూరు 1219, ప్రకాశం 1523, శ్రీకాకుళం 1517, విశాఖపట్నం 1984, విజయనగరం 885, పశ్చిమ గోదావరిలలో 2066 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios