కాపు కోటాపై జగన్ వ్యూహం: బాబు పోరు వృధానే, ఆత్మరక్షణలో పవన్?

Why YS Jagan made statement on Kapu reservations?
Highlights

కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమంటూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జగన్ పై తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. 

అమరావతి: కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమంటూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జగన్ పై తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ముద్రగడ పద్మనాభం జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కుంటూ వచ్చారు.

ముద్రగడను కూడా ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉందని, కాపులు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని గ్రహించకుండానే జగన్ ఆ ప్రకటన చేశారా అనేది ప్రశ్న. అది తెలిసి కూడా ఆ ప్రకటన చేశారంటే జగన్ వ్యూహం ఏమై ఉంటుందనేది ఆలోచించాల్సిన విషయం. 

అది కూడా కాపులు అధికంగా ఉండే తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గాన్ని ఆ ప్రకటన చేయడానికి జగన్ ఎంచుకున్నారు. జగన్ ఆ ప్రకటన చేయడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిదానికి వెళ్తే... చేయగలిగేది మాత్రమే జగన్ చెబుతాడనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం. ఆ విషయాన్ని తన ప్రసంగంలో జగన్ కాస్తా స్పష్టంగానే చెప్పారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరి వల్ల అవి అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఓ వైపు ఉండగా, అదనపు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం తనకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా కాలం క్రితమే స్పష్టం చేసింది. 

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేసిన చంద్రబాబు ప్రభుత్వం దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని కోరింది. ఆ షెడ్యూల్ లో చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అందుకు కేంద్రం సుముఖంగా లేదు. యాభై శాతం రిజర్వేషన్లలోనే కాపు రిజర్వేషన్లను చేర్చాలంటే ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను తగ్గించాల్సి ఉంటుంది. అందుకు బీసీలు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అందువల్ల కాపులకు రిజర్వేషన్లను అమలు చేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదని అందరికీ తెలుసు. అయినా, చంద్రబాబు ప్రభుత్వం తప్పును కేంద్రం మీదికి నెట్టి కాపులను తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. 

ఈ స్థితిలోనే తాను చేయడానికి సాధ్యం కాని కాపు రిజర్వేషన్లను తాను చేయలేనని స్పష్టంగా జగన్ చెప్పేశారు. తద్వారా, చేయగలిగేది మాత్రమే చెబుతారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని జగన్ అనుకుని ఉంటారు. దాని వల్ల, ఇంత వరకు తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తారనే సంకేతాలను ఆయన ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. జగన్ ఇస్తున్న హామీలు అమలు కావని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన ఆ రకంగా ఆ ప్రకటనను వాడుకోదలుచుకున్నట్లు అర్థమవుతోంది. అదే సమయంలో బీసీలు తనకు అనుకూలంగా మారడానికి వీలుంటుందని ఆయన భావించి ఉంటారు. 

రెండో విషయాన్ని వస్తే.... అది జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంశం. ఎంత లేదన్నా పవన్ కల్యాణ్ వైపు కాపు సామాజిక వర్గం మొగ్గు చూపుతుందనే విషయం అందరికీ తెలుసు. కాపు సామాజిక వర్గం ఎలాగూ పవన్ కల్యాణ్ వైపు ఉంటుంది కాబట్టి వారిని బుజ్జగించాల్సిన అవసరం తనకు లేదని కూడా జగన్ భావించి ఉంటారు. కాపు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా రాజకీయాలను చూసేవారు కాపుల్లో కూడా ఉండవచ్చు. అది తనకు ఎలాగూ అనుకూలంగానే ఉంటుంది. అందువల్ల కాపు రిజర్వేషన్ల ఉచ్చులో చిక్కుకోవద్దని ఆయన భావించి ఉంటారు. అదే సమయంలో కాపు కార్పోరేషన్ కు రెట్టింపు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు ఎలాగూ అమలు కావు కాబట్టి అధిక నిధుల ద్వారా ప్రయోజనమే కలుగుతుంది కదా అనే భావనకు గురయ్యే సెక్షన్ కూడా కాపు సమాజంలో ఉండవచ్చు. వారి మద్దతు తనకు లభిస్తుందని జగన్ భావిస్తూ ఉండవచ్చు.

ఇదిలావుంటే, కాపు రిజర్వేషన్లపై జగన్ ప్రకటన వల్ల పవన్ కల్యాణ్ కూడా స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాల్సిన అనివార్యతలో పడ్డారని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ వస్తున్నారు. హామీ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని మాత్రమే పవన్ కల్యాణ్ ఇంత వరకు  మాట్లాడుతూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కాపు రిజర్వేషన్ల విషయంలో తాను ఏం చేస్తాననే విషయాన్ని ఆయన చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రజారాజ్యం స్థాపించినప్పుడు చిరంజీవి చేసిన పొరపాటు కూడా అదే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వంటి ప్రధానమైన డిమాండ్లపై ఆయన స్పష్టమైన వైఖరి ప్రదర్శించలేదు. కేవలం ఇమేజ్ తో రాజకీయాల్లో నెట్టుకు రాలేమని ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం తెలియజేస్తోంది. 

ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కాంగ్రెసు ఆధిపత్యం మాత్రమే ఉంది. వామపక్షాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. మరోవైపు తెలుగు ప్రజల ఆత్మగౌరవమనే బలమైన నినాదం ఎన్టీఆర్ చేతికి అందివచ్చింది. కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర కాంగ్రెసు నేతల పట్ల వ్యవహరించిన తీరు వల్ల ఆ నినాదం బలంగా పనిచేసింది. అటువంటి పరిస్థితి ఏదీ ఇప్పుడు లేదు. ప్రత్యేక హోదాపై గానీ, విశాఖ రైల్వే జోన్ పై గానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీపై గానీ నేరుగా యుద్ధాన్ని ప్రకటించాల్సింది కేంద్ర ప్రభుత్వంపైనే. అదేం పవన్ కల్యాణ్ చేయడం లేదు. 

ప్రత్యేక హోదాను సెంటిమెంట్ గా మార్చింది జగన్ అనే అభిప్రాయం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలంగా పనిచేసేది ప్రత్యేక హోదా నినాదమే. అందువల్ల పవన్ కల్యాణ్ ఆ అంశంపై పూర్తిగా క్రెడిట్ కొట్టేసే అవకాశం లేదు. దాన్ని జగన్ కూడా పంచుకుంటారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలు పవన్ కల్యాణ్ కే కాకుండా జగన్ కూడా కలిసి వచ్చే పరిస్థితి ఉంది. అదే సమయంలో చంద్రబాబు అవే అంశాలను ప్రధానం చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై, బిజెపిపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. 

కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు చేసేదంతా చేసినట్లే చెబుకుంటున్నారు. కాకుంటే, జగన్ ను ఇరకాటంలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిందిగా తన పార్టీ ఎంపీలకు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రత్యేక హోదాపై, విభజన హామీలపైనే వారి పోరాటాన్ని పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై పోరాటం చేస్తే పట్టించుకుంటుందనే నమ్మకం బహుశా ఎవరికీ ఉండి ఉండదు. అందువల్ల కాపు రిజర్వేషన్ల అమలయ్యే పరిస్థితి లేదు కాబట్టి, చంద్రబాబు వాటిని అమలు చేయించలేరు కాబట్టి జగన్ కుండ బద్దలు కొట్టి ఉంటారు. ఏమైనా, ఇప్పుడు కాపు రిజర్వేషన్ల వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంటలు రేపుతోంది.

loader