టిడిపిలోని చాలామంది నేతల్లో ఒక అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. అదేంటంటే, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని గనుక పనిగట్టుకుని ప్రతీ రోజు తిడుతూ ఉంటే చాలని. ఎందుకంటే, జగన్ ను తిట్టేవాళ్ళనే చంద్రబాబు చేరదీస్తారని, అందలాలు ఎక్కిస్తారని. తాజాగా ఆదివారం కూడా అదే జరిగింది.

ఇంతకీ విషయం ఏమిటంటే, టిడిపిలో భర్తీ అవ్వాల్సిన రెండు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సిఎం రమేష్ పేరు ఖాయమైపోయింది. చంద్రబాబు సామాజికవర్గాలను దృష్టిలో పెట్టుకుని రకరకాల కాంబినేషన్లు చూస్తున్నారు. ఓసి-బిసి, ఓడి-ఎస్సీ, ఎస్సీ-బిసి ఇలాంటి కాంబినేషన్లలో ఉన్న నేతల పేర్లన్నీ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అటువంటి కాంబినేషన్లలో ప్రధానంగా వినిపించిన పేరు ఎస్సీ నేత వర్ల రామయ్యది. మీడియాలో ఏ స్ధాయిలో వర్ల పేరు ప్రచారం జరిగిందంటే సిఎం రమేష్ తో పాటు వర్ల పేరును చంద్రబాబు ఖరారు చేశారని చెప్పేసింది. దాంతో పార్టీ నేతల నుండి వర్లకు ఒకటే అభినందనల ఫోన్లు. ఇంకేముంది కుటుంబసభ్యులతో వర్ల కారులో చంద్రబాబు నివాసానికి బయలుదేరారు.

మధ్యలో ఓ ఛానల్ రిపోర్టర్ వర్ల కారును నిలిపి ఇంటర్వ్యూ చేశారు. మైక్ చూడగానే వర్లలో ఎక్కడ లేని ఆవేశం వచ్చేసింది. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. అంతటి ఆగితే ఆయన వర్ల ఎందుకవుతారు? పనిలో పనిగా జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ అవినీతిని, వైసిపిలో సామాజికవర్గ న్యాయం తదితరాలపై జగన్ ను ఓ రేంజిలో తిట్టారు.

ఇంటర్యూ అయిపోయిన తర్వాత వర్ల బయలుదేరేశారు. అయితే, వర్ల అలా బయలుదేరారో లేదో వెంటనే ఛానళ్ళల్లో బ్రేకింగ్ అంటూ మరో న్యూస్. సిఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్లకు చంద్రబాబు రాజ్యసభకు ఎంపిక చేశారంటు. దాంతో వర్లకు ఒక్క సారిగా షాక్ కొట్టింది. చేసేదిలేక కుటుంబ సభ్యులతో అదే కారులో వెనక్కుతిరిగి వెళ్ళిపోయారు. ఇప్పటికైనా వర్ల కానీ మరో నేత కానీ తెలుసుకోవాల్సిందేమంటే జగన్ తిట్టినంత మాత్రాన చంద్రబాబు పదవులు ఇవ్వరని.