విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అని పేరెత్తితే చాలు ప్రతీ ఒక్కరూ ఠక్కున చెప్పేది వైసీపీ ఎమ్మెల్యే రోజా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వారిని రోజా టార్గెట్ చేస్తే ఇక వారి పని అయిపోయినట్లే. తన పదునైన మాటల తూటాలతో వారిపై వదిలితే అవతలి వారిపని గోవింద. 

పార్టీపై విమర్శలు చేస్తే ఇలా రెచ్చిపోయే రోజా అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ జోలికి వస్తే ఇక ఊరుకుంటారా. తూర్పారబడతారు. అవతలివారు ఎంతటి వారైనా సరే ఊరుకోరు. పదునైన మాటలతో విరుచుకుపడతారు. అవతలి వ్యక్తి తాట తీసేవరకు వదిలిపెట్టరు. 

వైఎస్ జగన్ విషయంలో అంత స్వామిభక్తి కనబరుస్తారు ఎమ్మెల్యే రోజా. ఇది జగమెరిగిన సత్యం. వైఎస్ జగన్ పై ఈగ కూడా వాలనివ్వని రోజా గత కొద్దిరోజులుగా ఒక విషయంపై మాత్రం స్పందించడం లేదు. ఆ అంశం ఏంటనేది ఇప్పటికే అర్థమై ఉంటుంది. 

మెగాస్టార్ సోదరుడు నాగబాబు విషయంలో మాత్రం రోజా నోరెత్తడం లేదని విమర్శలు వస్తున్నాయి. మెగాబ్రదర్ నాగబాబు గత కొద్దిరోజులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఏకీ పారేస్తున్నారు. మామూలుగా కాదు ఒక రేంజ్ లో విమర్శిస్తున్నారు. 

ఒకప్పుడు ఫేస్ బుక్ ద్వారా పవన్ ను విమర్శించిన వాళ్లకి ఘాటుగా సమాధానం చెప్పే నాగబాబు గత కొద్దిరోజులుగా రూట్ మార్చారు. మై ఛానల్ నా ఇష్టం అంటూ యూట్యబ్ ఛానెల్ పెట్టారు. యూట్యూబ్ ఛానెల్ వేదికగా జగన్ ను ఓరేంజ్ లో ఆడేసుకుంటున్నారు. గతంలో జగన్ మాట్లాడిన వీడియోలు పోస్ట్ చేసి విమర్శలదాడి పెంచుతున్నారు. 

మై ఛానల్ నా ఇష్టం యూట్యూబ్ ఛానెల్ లో జగన్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్యూ వీడియోను విడుదల చేశారు. ఆ ఇంటర్వ్యూలో జగన్ అన్న వ్యాఖ్యలకు అర్థాలను వివరించారు నాగబాబు. 

ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. ‘ఎందుకు మీరు ఆ చంద్రబాబు గారిని ఈ మాటలు అడగరు? అడగాలి అంటే ఆయన చేసిన అవినీతి అట్లుంది. అక్కడ దాని మీద ఎంక్వయిరీ ఏ స్టేజిలో జరుగుతుందో నాకు అయితే తెలీదు. బహుశా నా స్టేజి కూడా దాటిపోయి కోర్టు స్టేజి కూడా దాటిపోయి’ అని అన్నారు.

జగన్ వ్యాఖ్యలపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ మాటల్లో మనం ఒకటి గుర్తించాలి. వీడు నాకన్నా గొప్పవాడు అంటే అర్థం ఏమిటి..? వాడు గొప్పవాడు.. నేను కూడా గొప్పవాడినే. ఇతడు నాకన్నా ఎక్కువ సాధించాడు అంటే అర్థం ఏంటి..? అతను బాగా సాధించాడు. 

 నేను కూడా ఎంతో కొంత సాధించాను అని. అలాగే కొన్ని కొన్నిసార్లు వాడు నాకంటే పెద్ద ఎదవ అంటారు. అంటే అర్ధం ఏంటి.. వాడు పెద్ద ఎదవ నేను ఓ రేంజ్ ఎదవనని. వాడు నాకంటే దుర్మార్గుడు అంటే నేను దుర్మార్గుడ్ని అని. నాకన్నా పెద్ద దొంగ అంటే నేను కూడా దొంగనే అని ఇలా చెప్తుంటాం మనం.’’ అని అన్నారు. 

‘‘ జగన్ చెప్పిన దాంట్లోనూ ఇదే కనిపిస్తోంది. నాకో స్టేజ్ ఉంది.. నాకో లెవల్ ఉంది. నా మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఇదీ నా రేంజ్. నాకంటే ఎక్కువ రేంజ్‌కి వెలిపోయారంటే.. ఒక రకంగా జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబు నాయుడిని చూసి చిన్న జెలసీ ఫీల్ అవుతున్నారు. దీనిపై మీరేమంటారు’’ అంటూ నాగబాబు వీడియోలో పేర్కొన్నారు. 

ఇంతటి ఘాటు విమర్శలు చేసినా కూడా రోజా కనీసం నోరు మెదపలేదు. నాగబాబు అంతటితో ఆగిపోలేదు. మరో వీడియో పోస్ట్ చేస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు తీయాలా అని ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా ఉంది. 

మరో దాంట్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే మన ప్లేట్లో మనం బిర్యానీ తినొచ్చు అనే కామెంట్స్ చేశారు. వాటిని నాగబాబు  యూ ట్యూబ్ ఛానెల్ లో వీడియోలు చూపించారు. ఆ తర్వాత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఎవరు ఎటు చూసినా మన జగన్మోహన్ రెడ్డిగారు మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలిచిన ఆంధ్రప్రదేశ్ ని ఒక బిర్యానీ ప్లేట్ లాగా చేసుకొని అందులోని బిర్యానీలాగా తినేద్దామని ప్లాన్ చేశారని విమర్శించారు. ఖర్చు పెట్టండి.. గెలవండి. గెలిచాక.. ఏపీకి బిర్యానీ ప్లేట్ లాగా చేసుకొని తినేద్దాం అన్నాడు. ఎంత క్లారిటీ ఉన్న నాయకుడో’’ అంటూ నాగబాబు కామెంట్స్ చేశారు. 

నాగబాబు ఇంతలా రెచ్చిపోతున్న రోజా ఖండించకోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చకు దారి తీసింది. నాగబాబు, రోజా ఇద్దరూ జబర్ధస్త్ ప్రోగ్రాంకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా నాగబాబుపై విమర్శలు చెయ్యకుండా మౌనం దాలుస్తున్నారని తెలుస్తోంది. 

నాగబాబు ఇష్టం వచ్చినట్లు జగన్ ని తిడుతుంటే కో జడ్జిగా ఉన్నంత మాత్రాన విమర్శించరా అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు. మరి రోజా మౌనం వెనుక కారణం ఏంటో అనేది ఆమె పెదవి విప్పితే కానీ తెలియదు.