ఎన్నికల్లో గెలుపుకు ఒకొక్కళ్ళది ఒక్కో మార్గం. కొందరు ప్రత్యర్ధులతో నేరుగా పోరాడుతారు. మరికొందరు ప్రత్యర్ధులతో పరోక్షంగా పోరాటం చేస్తారు. ఎవరి పోరాటం ఎలాగున్నా చంద్రబాబు పోరాటం మాత్రం వెరైటీగా ఉంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే, రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ఓట్లు గల్లంతైపోతున్నాయి. ఎవరో వైసిపి సభ్యత్వం తీసుకున్న వాళ్ళవి కావు. ఏకంగా వైసిపి ఎంఎల్ఏలతో పాటు పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన వారివి, పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల ఓట్లు కూడా ఓటర్ల జాబితాలో నుండి గల్లంతైపోతున్నాయి.

తాజాగా బయటపడిన ఓటర్లజాబితాలో డొల్లతనం రాజకీయ పార్టీలో కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు ఓటర్ల జాబితా నుండి మాయమైపోయాయి. అదేవిధంగా నరసరావుపేట వైసిపి ఎంఎల్ఏ గోపిరెడ్డి దంపతుల ఓట్లు కనబడలేదట. ఆమధ్య విశాఖపట్నం నగరంలో కూడా పెద్ద ఎత్తున వైసిపి ఓట్లు జాబితాలో కనబడలేదు. అంతుకుముందు కడప కార్పొరేషన్లో ఏకంగా లక్ష ఓట్లు మాయమైపోయాయి. గుంటూరులో కూడా వేల ఓట్లను జాబితా నుండి తొలగించారు. కాకినాడు కార్పొరేషన్లో పెద్ద గొడవే అయింది.

గెలవాలంటే ఎన్నికల్లో పోటీ చేయకతప్పదు. ఆ విషయం పక్కనబెడితే కోట్ల రూపాయల ఖర్చు అదనం. అంత ఖర్చు పెట్టినా గెలుపుపై నమ్మకం అంతంత మాత్రమే. అందుకనే చంద్రబాబు సులువైన మార్గం కనిపెట్టినట్లున్నారు. అసలు ఎన్నికల వరకూ ఆగకుండానే ముందుగానే ప్రత్యర్ధుల ఓట్లను గల్లంతు చేసేస్తే గొడవే ఉండదనుకున్నట్లున్నారు. ఓటర్ల జాబితాలో నుండి ఓట్లను తొలగించటం అధికారుల చేతివాటమనటంలో సందేహం లేదు. ఎవరైనా గుర్తించి నిలదీస్తే మాత్రం ఓటు కోసం దరఖాస్తు చేసుకోండి పరిశీలిస్తామని చెబుతున్నారు. ఉన్న ఓట్లను తీసేయటమెందుకు? నిలదీస్తే మళ్ళీ దరఖాస్తు చేసుకోమని చెప్పటమేంటో అర్దం కావటం లేదు.  

ఓటర్ల జాబితా నుండి గల్లంతవుతున్న ఓట్లలో ప్రత్యేకించి వైసిపి మద్దతుదార్ల ఓట్లను మాత్రమే ఎందుకు కనబడటం లేదు. జాబితా నుండి తమ పేరు గల్లంతైతే సామాన్య  జనాలతో పాటు టిడిపి మద్దతుదారుల ఓట్లు కూడా మాయమైపోవాలి కదా? అంటే ఇక్కడ మ్యాటర్ వెరీ క్లియర్. ప్రత్యేకించి గుర్తుపెట్టుకుని మరీ వైసిపి ఓట్లను ఏరేస్తున్నారు. ఓట్ల విషయంలో ఇపుడే మేలుకోకపోతే వైసిపి రేపటి ఎన్నికల్లో పోటీ చేయటం కూడా దండగే.