గెలుపుఖాయమని అనుకున్న జిల్లా నుండి కూడా లోకేష్ ను పోటీలో దింపటానికి చంద్రబాబు ఇష్టపడటం లేదంటే అర్ధమేమిటి?
‘ఆరునెలలు కర్రసాము చేసి మూలనున్న ముసలమ్మను కొట్టాడ’ని సామెత. చంద్రబాబునాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యవహారం అచ్చంగా అలానే ఉంది. ఎంఎల్ఏ కోటాలో లోకేష్ ను ఎంఎల్సీగా పంపటానికి ఇంత తతంగం అవసరమా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తన పాలన పట్ల ప్రజల్లో 80 శాతం సంతృప్తితో ఉన్నారని తరచూ చెబుతుంటారు. మెజారిటీ జిల్లాల్లో ప్రజాప్రతినిధులు టిడిపిలోని వారే అయినా లోకేష్ ను స్ధానిక సంస్ధల ఎన్నికల కోటాలొ ఎంఎల్సీగా పోటీ చేయించేందుకు చంద్రబాబు వెనకాడుతున్నారు.
ఆదివారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో లోకేష్ ను ఎంఎల్సీ గా పంపే నిర్ణయాన్ని పరిశీలించాలని చెప్పారట. అదికూడా ఎంఎల్ఏ కోటాలో పంపాలట. అద్దిరిపోలే నారావారి ప్లాన్. అప్పటికేదో లోకేష్ ను ఎంఎల్సీగా ఎంపిక చేయటం తనకిష్టం లేనట్లు, పార్టీ శ్రేణులు, పొలిట్ బ్యూరో ఒత్తిడి మేరకే తప్పదన్నట్లు బిల్డప్. మొత్తానికి చాలాకాలంగా నడుస్తున్న ఓ ప్రహసనానికి దాదాపు తెరపడినట్లే. ఇక, ఏ కేటగిరీలో పంపాలన్నది చంద్రబాబు ఇష్టమే. అయితే, మెజారిటీ సభ్యుల నిర్ణయమేమిటంటే, లోకేష్ ను ఎంఎల్ఏ కోటాలోనే పంపాలని. ఎందుకంటే, అడ్వాన్ బుకింగ్ లో విజయం ఖాయం కనుక. స్ధానిక సంస్ధల కోటాలో అయినా పంపవచ్చు. మరెందుకు పంపటం లేదు?
చాలా జిల్లాల్లో స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు టిడిపిలోనే ఎక్కువమంది ఉన్నారు. తూర్పు గోదావరి, అనంతపురం, ఉత్తరాంధ్రజిల్లాలు ఇలా ఏ జిల్లాలో ఓట్లు ఎక్కువుంటే ఆ జిల్లా నుండే పంపవచ్చు కదా? అయినా ధైర్యం చేయటం లేదెందుకని? అంటే గెలుపుపై ఎక్కడో అనుమానం ఉందా? అప్పటికీ 9 సీట్లకు స్ధానిక సంస్ధల కోటాలో జరుగుతున్న ఎన్నికల్లో 7 సీట్లు టిడిపి కి ఖాయమని టిడిపి అనుకూల మీడియా మొదటి నుండి చెబుతున్నది. ఎంఎల్ఏని ఎవరినైనా రాజీనామా చేయించి అక్కడి నుండి లోకేష్ ను పోటీ చేయించాలంటే అనేక సమస్యల తలెత్తుతాయని చంద్రబాబు ఆలోచించారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ గెలుపుఖాయమని అనుకున్న జిల్లా నుండి కూడా లోకేష్ ను పోటీలో దింపటానికి చంద్రబాబు ఇష్టపడటం లేదంటే అర్ధమేమిటి?
