చంద్రబాబునాయుడు మాటల విన్నతర్వాత తెలుగుప్రజలందరికి ఓ సందేహం మొదలైంది. తెలుగుజాతి అంటేనే చంద్రబాబా? అని. తెలుగుజాతికి చంద్రబాబుకు ఏంటి సంబంధమంటే? ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే, ‘కేంద్రంలోని బిజెపి యుద్ధం చేస్తానని చెబుతోంది’..‘ఎవరిపై యుద్ధం చేస్తారు? తెలుగుజాతిపైనా? ఏపి పైనా’? అంటూ కొద్ది రోజులుగా విరుచుకుపడుతున్నారు. పైగా టిడిపి పుట్టిందే తెలుగుప్రజల ఆత్మగౌరవం కాపాడటం కోసమే అని కూడా అంటున్నారు.

ఇక్కడే జనాలకు ఓ సందేహం మొదలైంది. అదేమిటంటే, టిడిపి పుట్టింది తెలుగుదేవారి ఆత్మగౌరవం రక్షించుకునేందుకే అనటంలో ఎవరికీ సందేహాల్లేవు. టిడిపిని ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావే కానీ చంద్రబాబు కాదన్న విషయం అందరికీ తెలుసు. అటువంటి ఎన్టీఆర్ ను అవమానకర రీతిలో ముఖ్యమంత్రి కుర్చీలో నుండి దింపేసిందెవరు? ? ఆయన మరణానికి కారకులెవరు? అన్న విషయాన్ని తెలుగు ప్రజలెప్పుడూ మరచిపోలేరు.

అదే సమయంలో తెలుగుజాతి అంటే చంద్రబాబేనా? తెలుగుజాతికి చంద్రబాబుకు ఏంటి సంబంధం? నిజంగానే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే చంద్రబాబు పోరాడేవారైతే కేంద్రమంత్రివర్గంలోనుండి ఎప్పుడే బయటకు వచ్చేసేవారు. ఎన్డీఏకి గుడ్ బై చెప్పేసేవారే. ఎందుకంటే, నాలుగేళ్ళుగా ఏపి ప్రయోజనాల కోసం కేంద్రం ఏమీ చేయలేదని ఇపుడు చెబుతున్న చంద్రబాబు ఇంతకాలం ఎందుకు ఆ పనిచేయలేదు? పైగా ఆత్మగౌరవం గురించి చంద్రబాబు మాట్లాడటాన్ని నెటిజన్లు పెద్ద జోక్ గా వర్ణిస్తున్నారు.

ఇక్కడ సమస్య మొదలైంది కేంద్రం-చంద్రబాబు మధ్య మాత్రమే. తనకు వ్యక్తిగతంగా సమస్యలు మొదలవుతుంటే ఆ సమస్యలను యావత్ తెలుగుప్రజలకు అంటకట్టటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు మీద కోపంతో ఏపికి అన్యాయం చేయటం కేంద్రం తప్పే అన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఏపికి కేంద్రం అన్యాయం చేసిందనుకుంటే ఏవిధంగా సమాధానం చెప్పాలో జనాలు నిర్ణయించుకుంటారు. కాకపోతే అటువంటి సమాధానమే జనాలు తనకు కూడా చెబుతారేమో  అన్న ఆందోళనే చంద్రబాబులో ఎక్కువగా కనబడుతోంది.