అమరావతి: దక్షిణాది రాష్ట్రాల నటులపై ప్రధాని నరేంద్రమోదీ శీతకన్ను వేశారా...? సినీతారలకు విందు ఇచ్చిన మోదీ దక్షిణాది నటులను పక్కన పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి...? దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవడంతోపాటు మోదీ ఇచ్చే ప్రతీ పిలుపును అనుసరిస్తున్న దక్షిణాది నటులను ఎందుకు వెనక్కి నెట్టారు..?  

మోదీ దృష్టిలో నటులు అంటే కేవలం బాలీవుడ్ మాత్రమేనా...? బాహుబలి సినిమాతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది టాలీవుడ్. బాలీవుడ్ రికార్డులను సైతం తలదన్నింది. అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ పై ప్రశంసలు కురిపిస్తుంటే మోదీ మాత్రం పక్కన పెట్టేశారు. 

టాలీవుడ్ కు ఇంత అన్యాయం జరిగినా నటులు మాట్లాడకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి కోడలు, హీరో రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన, నటి కుష్భూ మినహా ఇంకెవరు స్పందించలేదు. 

తెలుగుసినీ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడినా, తక్కువగా చేసి చూసినా ఒంటికాలిపై లేచే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైలెంట్ గా ఉండిపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. మోహన్ బాబు వైసీపీలో ఉండటం వల్లే మోదీని విమర్శించడం లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 

కేంద్రప్రభుత్వంతో సీఎం వైయస్ జగన్ సయోధ్యతో ఉండాలని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మోదీపై మోహన్ బాబు ఎలాంటి విమర్శలు చేసినా దాని ఎఫెక్ట్ ప్రభుత్వంపై పడుతుందని భయపడుతున్నారా..? లేక సైలెంట్ గా ఉండమని జగన్ చెప్పారా...?  అన్న చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతుంది.

మోహన్ బాబు మౌనంగా ఉండటానికి కారణాలేంటి...? మోహన్ బాబు గతంలో ఎలా ఉండేవారు...? మౌనం వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏంటో ఓసారి తెలుసుకుందాం. టాలీవుడ్ చరిత్రలో క్రమశిక్షణకు మారుపేరుగా మోహన్ బాబును చెప్తూ ఉంటారు. అంతేకాదు ఆయన గళమెత్తితే చాలు బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. డైలాగ్ చెప్తే చాలు సహనటులు బెంబేలెత్తిపోవాల్సిందే. అందుకే ఆయనను డైలాగ్ కింగ్ అని పిలుస్తుంటారు. 

అన అద్భుతమైన హావాభావాలతో, నటనతో థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించగల సత్తా మోహన్ బాబుకే దక్కింది. ఏ పాత్రలోనైనా ఒదిగిపోవడంలో మోహన్ బాబుకు సాటిరారు మరోకరు అంటారు టాలీవుడ్ లో. 

విలన్ సినీమాల్లోకి ప్రవేశించిన ఆయన ఆ తర్వాత మీరో స్థాయికి ఎదిగారు. హాస్యాన్ని సైతం అలవోకగా పండించగల నటుడిగా ఆయనకు పేరు. రోటీన్ కి భిన్నంగా ఎన్నో విలక్షణ పాత్రలు వేసిన నటుడు మోహన్ బాబు. 

సినీనటుడుగా ఎన్నో రికార్డులు తిరగరాసిన మోహన్ బాబు ఆ తర్వాత నిర్మాతగా కూడా వెలుగొందారు. నిర్మాతగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 80కి పైగా సినిమాలు నిర్మించి తెలుగు పరిశ్రమకు ఎంతో సేవలందించారు మోహన్ బాబు. 

తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. తన మనసులో ఏముందో నిర్భయంగా చెప్పే నటుడు. చిన్నా పెద్దా అనే తేడా ఉండదు. ఎక్కడ తప్పు జరిగినా ఎదురుతిరగడంలో ఆయనకు ఆయనే సాటి. 

ఇకపోతే తెలుగు ఇండస్ట్రీ అంటే మోహన్ బాబుకు ఎనలేని గౌరవం. తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడినా టాలీవుడ్ లో ఏమైనా గొడవలు తలెత్తిన ఆ సమస్యలను పరిష్కరించడంలో మోహన్ బాబుకే తెలుసు. 

ఇకపోతే టాలీవుడ్ కి అన్యాయం జరిగినా టాలీవుడ్ లో ఎవరికైనా అన్యాయం జరిగినా మాటల దాడికి దిగుతారు మోహన్ బాబు. అవార్డుల విషయంలో వారు వీరు అని కూడా చూడకుండా పదిమందిలోనూ మైకు పట్టుకుని ఓ దుమ్ముధులిపేస్తారు. 

అందుకు వజ్రోత్సవాల్లో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తెలుగు సినీపరిశ్రమ అంగరంగ వైభవంగా నిర్వహించిన వజ్రోత్సవాల్లో కొందరు నటులపై మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేశాయి. 

అనంతరం నంది అవార్డులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు రాజకీయాల వల్లే తనకు నంది అవార్డు రాలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డులు వెనుక రాజకీయం ఉన్నందున ప్రతిభకు సరైన గుర్తింపు దక్కడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ హాట్ టాపిక్ గా నే ఉంటాయి. 

అలాంటి వ్యక్తి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీపరిశ్రమపై మోదీ ప్రభుత్వం శీతకన్ను వేసినా స్పందిచకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దివంగత దాసరి నారాయణ రావు హయాంలో తెలుగు పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మోహన్ బాబు ముందువరుసలో ఉండేవారు. 

సినీ పరిశ్రమ తన కన్నతల్లి అంటూ పరిశ్రమకు అన్యాయం చేసినా మోహన్ బాబు విరుచుకుపడతారు. అలాంటిది మహాత్మగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఛేంజ్ విత్ ఇన్ కార్యక్రమానికి దక్షిణాది నటులను మోదీ ఆహ్వానించకపోవడం మోహన్ బాబు స్పందించకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. 

మోహన్ బాబు కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్రమోదీకి మంచి సంబంధాలే ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోదీని కుటుంబ సభ్యులతో సహా వెళ్లి మరీ కలిశారు మోహన్ బాబు. అలాంటిది మోహన్ బాబును సైతం మోదీని ఆహ్వానించకపోయినా స్పందించకపోవడంపై చర్చ జరగుతుంది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా మోదీపై విరుచుకుపడ్డారు. అలాగే నటి కుష్భూ సైతం మోదీ వ్యవహరించిన తీరుపై విరుచుకుపడ్డారు. కానీ మోహన్ బాబు మాత్రం తనకేంటిలే అని వేచి చూడటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం మోహన్ బాబు వైసీపీలో ఉన్నారు. సీఎం జగన్ మోదీతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మోహన్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా దాని ప్రభావం వైసీపీపై పడే అవకాశం ఉంటుందని భావించే విమర్శలు చేయడం లేదని తెలుస్తోంది.