అమరావతి: ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావుడి చేస్తున్న  కేసీఆర్ కోల్‌కత్తా ర్యాలీకి ఎందుకు హాజరుకాలేదో చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించే విధంగా కేసీఆర్ తీరు ఉందని బాబు అభిప్రాయపడ్డారు.

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం నాడు  చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగింది.  ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై  పార్టీ నేతల తీరుపై బాబు చర్చించారు.

దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా  ఫెడరల్ ఫ్రంట్‌తో కేసీఆర్  ప్రయత్నాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే  కోల్‌కత్తా తరహాలోనే దేశ వ్యాప్తంగా పది చోట్ల ర్యాలీలను నిర్వహించేందుకు  ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో ప్రకటించారు.

ఎన్నికల మేనిఫెస్టో‌ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

మరో వైపు గుంటూరు జిల్లా నేతలపై ఈ సమావేశంలో చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు చెప్పినా కూడ  పార్టీ నేతల తీరులో మార్పు రాలేదని ఆయన అసహానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ నేతలంతా నిక్కచ్చిగా ఉండాలని బాబు ఆదేశించారు. బంధాలు, బంధుత్వాలు, స్నేహాలను పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయాలని చంద్రబాబునాయుడు సూచించారు. 

చుక్కల భూముల అంశంపై కూడ ఈ సమావేశంలో కూడ చర్చలు జరిగాయి. టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఈ అంశాన్ని చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువచ్చారు.  అయితే ఈ విషయమై ఈ సమస్యను పరిష్కరించడంలో జాయింట్ కలెక్టర్లు వైఫల్యం చెందారని  బాబు అభిప్రాయపడ్డారు.

మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకొంటామని బాబు సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్లకు బదులుగా  కలెక్టర్లకే ఈ విషయమై   బాధ్యతలను అప్పగించనున్నట్టు బాబు తేల్చి చెప్పారు.

రైతు రక్ష పేరుతో కొత్తగా రైతాంగం కోసం తీసుకొచ్చే కొత్త పథకంలో కౌలు రైతులకుయ కూడ వర్తింపజేసేలా ప్లాన్ చేయనున్నట్టు బాబు చెప్పారు. తెలంగాణ సర్కార్ రైతాంగం విషయంలో తక్కువ ఖర్చు చేసినా ఎక్కువగా ప్రచారం చేసుకొంటుందని  బాబు అభిప్రాయపడ్డారు. మరోవైపు  పోలవరం  ప్రాజెక్టు నిధుల విషయంలో  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసిన విషయాన్ని కూడ బాబు ప్రస్తావించారు.