Asianet News TeluguAsianet News Telugu

అంబటిరాయుడు వైసీపీ నుంచి జనసేనలోకి ఎందుకు వెళ్లారంటే...

ఇంతకీ వైసీపీ నుంచి జనసేనకు మారడానికి కారణమేంటి ? అంబటి రాయుడు ఆశించిన గుంటూరు ఎంపీ టికెట్  దక్కదనేనా? ఇప్పుడు జనసేన నుంచి బరిలోకి దిగితే అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడా?  అసలు అంబటి రాయుడు ఎందుకు తడబడుతున్నాడు?

Why did Ambatirayudu go from YCP to JanaSena? - bsb
Author
First Published Jan 10, 2024, 3:13 PM IST

గుంటూరు : అంబటి రాయుడు.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ ఫేవరెట్ గా వినిపిస్తున్న పేరు. క్రికెటర్ అయిన అంబటి రాయుడు.. వైసీపీలో తన రాజకీయ క్రీడను మొదలుపెట్టాడు. కానీ ఆ పిచ్ పై  రన్స్  చేసే అవకాశం లేదనుకున్నాడో ఏమో.. ఆటమొదలెట్టిన పది రోజుల్లోనే వైసీపీ నుంచి వెనుతిరిగాడు. ఇక తాను రాజకీయాల్లో కాకుండా ఆటల్లోనే ఉంటాను అన్నట్టుగా హింట్లు ఇచ్చాడు.. కానీ వారం తిరిగేలోగానే  జనసేనలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇంతకీ వైసీపీ నుంచి జనసేనకు మారడానికి కారణమేంటి ? అంబటి రాయుడు ఆశించిన గుంటూరు ఎంపీ టికెట్  దక్కదనేనా? ఇప్పుడు జనసేన నుంచి బరిలోకి దిగితే అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడా?  అసలు అంబటి రాయుడు ఎందుకు తడబడుతున్నాడు?

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మొదటి నుంచి  వైసిపి అభిమాని.  పార్టీలో చేరకపోయినా పార్టీ కార్యక్రమాలను పథకాలను ప్రచారం చేస్తుండేవారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 28వ తేదీన అధికారికంగా వైసీపీలోకి చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్ ఆయనను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో అంబటి రాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో తాను సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తునట్లుగా తెలిపారు. 

తాడేపల్లికి కేశినేని నాని, కాసేపట్లో సీఎం జగన్‌తో భేటీ .. కుమార్తె శ్వేతతో కలిసి వైసీపీలోకి..?

ముఖ్యమంత్రి జగన్ మీద తనకు మంచి అభిప్రాయం ఉందని కులమతాలకు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నారని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సమయంలో లోక్ సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా అంబటి రాయుడిని పోటీ చేయించే అవకాశాలు ఉన్నట్టుగా ఊహాగానాలు వెలువడ్డాయి. జగన్ నుంచి కూడా అంబటి రాయుడికి స్పష్టమైన హామీ రావడం వల్లే చేరారని అన్నారు. జగన్ కూడా అంబటి రాయుడిని ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రోగ్రాంకు స్టార్ క్యాంపెయినర్ గా చేశారు. 

ఆ తర్వాత వైసిపి  మొదటి, రెండో లిస్టులు  వెలువడడం.. సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకు మాత్రమే జగన్ అసెంబ్లీ కానీ, లోక్సభకు కానీ టికెట్లు ఇవ్వాలని పట్టు బట్టి ఉండడం.. ఈ క్రమంలో అంబటి రాయుడికి గుంటూరు ఎంపీ టికెట్ వచ్చే అవకాశాలు లేవని వినిపించింది. ఈ క్రమంలోనే జనవరి ఏడవ తేదీన అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. మరి కాసేపటికి తను తిరిగి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నానని, త్వరలో దుబాయ్ లో జరిగే ఐఎల్ టి 20లో  పాల్గొంటున్నట్లు  ట్వీట్ చేశారు. 

నిజంగానే దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్ టి20 లో అంబటి రాయుడికి చోటు దక్కింది. ముంబై ఇండియన్స్ కు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలా వృత్తిలో బిజీ అవడం వల్ల రాజకీయాల్లో ఉండడం భావ్యం కాదని వైసీపీని వీడినట్లుగా క్లారిటీ కూడా ఇచ్చారు అంబటి రాయుడు. అప్పటికే జగన్ తీరు వల్లే అంబటి రాయుడు చేరిన 10 రోజులకు కాకుండానే  వైసీపీని వీడాడు.. అంటూ ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. అంబటి రాయుడు ట్వీట్ తో  ప్రతిపక్షాల విమర్శలను వైసిపి తిప్పికొట్టాలనుకుంది.  

కానీ అంతలోనే.. అంబటి రాయుడు జనసేన లోచేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. జనసేన నుంచి రాజకీయాల్లోకి దిగి ఎమ్మెల్యే అవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు  జనసేన అధినేత  పవన్  కళ్యాణ్ తో అంబటి రాయుడు బుధవారం మధ్యాహ్నం గంటకు పైగా సమావేశమయ్యారు. మంగళగిరి జనసేన ఆఫీసులో పవన్ తో అంబటి రాయుడు భేటీ అయ్యారు. పొన్నూరు లేదా అవనిగడ్డనుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని అంబటిరాయుడు ఆశిస్తున్నారట. 

వైసీపీలో ఆశించిన టికెట్ దక్కకపోవడంవల్లే జనసేన వైపు చూస్తున్నాడని, ఏపీలో తెలుగుదేశం-జనసేన కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశ్యంతోనే వైసీపీ నుంచి బైటికి వచ్చినట్లు ఆయన అభిమానులంటున్నారు. మరో కారణం అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు. జనసేనకు దగ్గరవ్వడానికి ఇది కూడా ఓ కారణమేనని అంటున్నారు. ఏదేమైనా అంబటి రాయుడు ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనంగా మారారు. 

Follow Us:
Download App:
  • android
  • ios