టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని తన తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా బుధవారం కుమార్తె శ్వేతతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు.
టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని తన తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా బుధవారం కుమార్తె శ్వేతతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ తర్వాత వీరు వైసీపీలో చేరే అవకాశాలు వున్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కేశినేని వెంట వెలంపల్లి శ్రీనివాస్, అయోధ్య రామిరెడ్డి, దేవినేని అవినాష్ వున్నారు.
అన్నీ అనుకున్నట్లే జరిగితే రేపు(గురువారం) నానితో పాటు మరికొందరు టిడిపి నేతలు వైసిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఇంతకాలం తనతో కలిసి పనిచేసిన ఐదుగురికి ఎమ్మెల్య టికెట్లు ఇప్పించుకునేందుకు నాని ప్రయత్నిస్తున్నారు. ఇక ఎలాగూ తన ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయితేనే ఆయన వైసిపిలో చేరడం ఖాయం కానుంది. ఇలా తనను నమ్ముకున్న నేతల కోసం వైసిపి అధినేత జగన్ తో నాని చర్చించనున్నారు. అయితే ఆయన కోరినట్లు ఓ ఎంపీ, ఐదు ఎమ్మెల్యే టికెట్లు కాకుండా ఓ ఎంపీ, రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు వైసిపి సుముఖంగా వున్నట్లు సమాచారం.
వైసిపిలో చేరినా తిరిగి విజయవాడ లోక్ సభ నుండే నాని పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇప్పటికే కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసిన కేశినేని శ్వేత తండ్రితో పాటే వైసిపిలో చేరే అవకాశాలున్నాయి... ఆమెకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్నది నాని ఆలోచనగా తెలుస్తోంది. అలాగే తనవెంట నడిచేందుకు సిద్దమై ఎమ్మెస్ బేగ్ కు విజయవాడ పశ్ఛిమ, కన్నెగంటి జీవరత్నంకు నందిగామ, నల్లగట్ల స్వామికి తిరువూరు, బొమ్మసాని సుబ్బారావుకు మైలవరం అసెంబ్లీ టికెట్లు ఇప్పించుకునేందుకు కేశినేని నాని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే వైసిపి పెద్దలతో చర్చించిన నాని ఇవాళ వైఎస్ జగన్ తో కూడా చర్చించనున్నారు.
