‘నల్లారి’ కుటుంబం వల్ల టిడిపికి ఎంత లాభం ?

First Published 17, Nov 2017, 1:09 PM IST
Why Congress nallari family wants to join rival Telugu Desam party
Highlights
  • మొత్తానికి నల్లారి కుటుంబలోని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరటం ఖాయమైంది.

మొత్తానికి నల్లారి కుటుంబలోని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరటం ఖాయమైంది. నల్లారి కుటుంబం తెలుగుదేశంపార్టీలో చేరబోతోందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం కిషోర్ కుమార్ రెడ్డి  ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. దాంతో కిషోర్ టిడిపిలో చేరటం దాదాపు ఖాయమైందని టిడిపి నేతలు భావిస్తున్నారు.

అంతా బాగానే ఉంది కానీ నల్లారి కుటుంబం నుండి ఏమాశించి చంద్రబాబు, కిషోర్ ను పార్టీలోకి చేర్చుకుంటున్నరన్న విషయమే ఎవరికీ అర్దం కావటం లేదు. చిత్తూరు జిల్లాలో రాజకీయంగా బాగా  పేరున్న కుంటుంబాల్లో నల్లారి కుటుంబం కూడా ఒకటి. అయితే, కుటుంబానికున్నంత పేరు ఇప్పటి నేతలకు లేదు. ఎందుకంటే, వ్యక్తిగతంగా వారెవరూ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలిగేంత స్ధాయిలో లేరు.

ఏదో అదృష్టం కలిసొచ్చి 2010లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రైపోయారు. సిఎంగా దాదాపు మూడున్నర సంవత్సరాలున్నప్పటికీ జిల్లాపై ఏమాత్రం పట్టు సాధించలేకపోయారు. ఒకపుడు తన నియోజకవర్గం వాయల్పాడులో తప్ప పక్క నియోజకవర్గం నేతలను కూడా ప్రభావితం చేయలేకపోయారు. విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన  జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసిన కిషోర్ పీలేరులో ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి నల్లారి కుటుంబం రాజకీయంగా క్రియాశీలకంగా లేదు.

ఇంత కాలానికి మళ్ళీ నల్లారి కుటుంబం యాక్టివ్ అవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే, టిడిపిలో చేరుతున్నది కేవలం కిషోర్ మాత్రమే. కిరణ్ కాంగ్రెస్ లోనే కొనసాగాలని అనుకుంటున్నట్లు సమాచారం. కిరణ్ సిఎం అయ్యే వరకూ సోదరులు కిషోర్, సతీష్ లు బయట ప్రపంచానికి ఏమాత్రం తెలీదు. అటువంటిది కిషోర్ ను టిడిపిలోకి చేర్చుకోవటంపై టిడిపి నేతలే ఆశ్చర్యపోతున్నారు.

టిడిపిలో చేరనున్న కిషోర్ వచ్చే ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటుకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కిషోర్ ను చేర్చుకోవటం వల్ల చంద్రబాబు రెండు ప్రయోజనాలను ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. రాయలసీమలోని ప్రముఖ రెడ్డి కుటుంబాలు టిడిపిలో చేరుతున్నాయని ప్రచారం చేసుకోవటానకి పనికి వస్తుంది. అదే విధంగా కిషోర్ రాజంపేట పార్లమెంటుకు పోటీ ఖాయమైతే ఆమేరకు చంద్రబాబుపై ఆర్ధిక భారం తగ్గుతుంది. ఇంతకు మించి చంద్రబాబుకు నల్లారి కుటుంబం వల్ల ఏ ఉపయోగమూ ఉండదని టిడిపి నేతలే చెబుతున్నారు.

 

 

 

 

loader