Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబును చిక్కుల్లో పడేసిన జగన్: కేసీఆర్ కు భయపడుతున్నారా?

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచాలనే నిర్ణయం ద్వారా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఏపీ సీఎం వైఎస్ జగన్ చిక్కుల్లో పడేసినట్లే కనిపిస్తున్నారు. పోతిరెడ్డిపాడుపై మాట్లాడలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

Why Chandrababu is mum on Pothyreddypadu GO?
Author
Hyderabad, First Published May 22, 2020, 10:20 AM IST

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాదులో ఉంటున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఆయన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తన నివాసం నుంచి కదలడం లేదు. తన నివాసం నుంచే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నడిపిస్తున్నారు. ఈ సమయంలోనే పోతిరెడ్డిపాడు వివాదం ప్రారంభమైంది.

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను తీసుకుని వెళ్లడానికి వీలుగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 203 జీవోను జారీ చేసింది. దీంతో జగన్ కూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని భావిస్తున్నారు. కేసీఆర్ తో జగన్ స్నేహం చేస్తూ వచ్చారు. అయితే, ఇరువురు సీఎంల మధ్య స్నేహం బెడిసికొడుతుందా అనే సందేహం అంతటా నెలకొని ఉంది.

ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం చోటు చేసుుకున్న నేపథ్యంలో కాంగ్రెసు, బిజెపి నాయకులు ప్రాంతాలవారీగా విడిపోయారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ నేతలు నేతలు కన్నా లక్ష్మినారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ 203 జీవోను వ్యతిరేకిస్తూ కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. కాంగ్రెసు నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కూడా కేసీఆర్ మీద విమర్శలు చేస్తున్నారు. జగన్ తో కలిసిపోవడం వల్లనే జీవో 203 విడుదలైందని తెలంగాణ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. 

పోతిరెడ్డిపాడుపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఎప్పుడూ తనదైన శైలీలో స్పందించే టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి  జగన్ ను సమర్థింంచారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం తన వైఖరిని వెల్లడించడం లేదు. మాజీ నీటీ పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వంటి టీడీపీ నేతలు కూడా పోతిరెడ్డిపాడుపై మాట్లాడడం లేదు. చంద్రబాబు వైఖరికి అనుకూలంగానే వారు ఆ వివాదంపై నోరు మెదపడం లేదని భావిస్తున్నారు. 

పోతిరెడ్డిపాడుపై వైఖరి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) నాయకులు చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుపై చంద్రబాబును వారు చిక్కుల్లో పడేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా తనకు రెండు కళ్లలాంటివని భావించడం వల్లనే చంద్రబాబు తన వైఖరి వెల్లడించడం లేదా అనే సందేహం తలెత్తుతోంది. 

అయితే, తెలంగాణను దాదాపుగా చంద్రబాబు వదులుకున్నారు. అయినప్పటికీ ఆయన పోతిరెడ్డిపాడుకు అనుకూలంగా మాట్లాడకపోవడంలోని ఆంతర్యమేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీడీపీ తెలంగాణ నేతలు కూడా పోతిరెడ్డిపాడుపై మాట్లాడిన దాఖలాలు కనిపించడం లేదు. చంద్రబాబు వైఖరికి అనుకూలంగానే ఆంధ్రప్రదేశ్ నేతలు గానీ తెలంగాణ నేతలు గానీ పోతిరెడ్డిపాడుపై మాట్లాడడం లేదనే మాట వినిపిస్తోంది. 

పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తే తన ఆంధ్రప్రదేశ్ లో తన రాజకీయ భవిష్యత్తుకు సమస్య ఎదరువుతుందనే విషయం చంద్రబాబుకు తెలుసు. దానివల్ల ఆయన దాన్ని వ్యతిరేకించే పరిస్థితిలో లేరు. అదే సమయంలో దాన్ని సమర్థించి కేసీఆర్ ఆగ్రహానికి గురి కావడం కూడా ఆయనకు ఇష్టం లేదని అంటున్నారు. అందువల్లనే పోతిరెడ్డిపాడుపై మౌనమే తన వైఖరిగా ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిక్కుల్లో పడేసినట్లు భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios