విశాఖపట్నంలో ఎంతో అట్టహాసంగా మొదలై ముగిసిన మూడు రోజుల పెట్టుబడుల సదస్సులో చాలామంది కేంద్రమంత్రులు ముఖం చాటేసారు. సదస్సులో పాల్గొనాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం చాలామంది కేంద్రమంత్రులను ఆహ్వానించింది. అయితే, పరిశ్రామలశాఖ మంత్రి సురేష్ ప్రభు తప్ప ఇంకెవరూ కనబడలేదు. సరే, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఎటూ టిడిపికి చెందిన కేంద్రమంత్రులే కాబట్టి వారు హాజరయ్యారనుకోండి అది వేరే సంగతి.

చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మూడు రోజుల సదస్సుకు కేంద్రమంత్రులెందుకు హాజరుకాలేదు? టిడిపిలో ఇపుడీ విషయంపైనే  పెద్ద చర్చ జరుగుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపధ్యంలో తలెత్తిన వివాదాలు, రాజకీయ పరిణామాల నేపధ్యంలోనే కేంద్రమంత్రులెవరూ సదస్సుకు హాజరుకావటానికి ఇష్టపడలేదని సమాచారం.

పోయిన రెండు సదస్సులోనూ సుమారు 10 మంది కేంద్రమంత్రులు హాజరయ్యారు. తమ శాఖల తరపున రాష్ట్రప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలను(ఎంవోయు) కుదుర్చుకున్నారు. కేంద్రమంత్రులే కాకుండా పలువురు కేంద్రప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సరే ఎంవోయులన్నీ సాకారమయ్యాయా లేదా అన్న విషయాన్ని పక్కనపెడితే అంతమంది కేంద్రమంత్రులు, ఉన్నతాధికారుల హాజరుతో సదస్సుకు నిండుదనం వచ్చింది.

అంటే పోయిన రెండు సదస్సుల్లో కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు బాగా చొరవ తీసుకున్నారు. దాంతో పలువురు కేంద్రమంత్రులు సదస్పుల్లో హాజరయ్యేట్లుగా వెంకయ్యే లీడ్ తీసుకోవటంతో సరిపోయింది. కానీ ఇపుడు పరిస్ధితి వేరుగా ఉంది. అందులోనూ బడ్జెట్ తర్వాత కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, బిజెపి-టిడిపి మధ్య పరిస్ధితి బాగా క్షీణించింది. దాంతో పొత్తులు కొనసాగే విషయంలో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఇటువంటి నేపధ్యంలో సదస్సు జరగటంతో సురేష్ తప్ప మరే కేంద్రమంత్రి హాజరుకాలేదు. బహుశా కేంద్రంలోని పెద్దల ఆదేశాలతోనే కేంద్రమంత్రులు డుమ్మా కొట్టారని చర్చ జరుగుతోంది.