రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనబడుతోంది. పార్టీలోని రెండు వర్గాలు కీలక వ్యక్తులపై ఏకకాలంలో దండెత్తుతుండటంతో సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి. భాజపాలోని ఒక వర్గమేమో చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తుతుండగా, మరో వర్గం ఏకంగా గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్నే లక్ష్యంగా చేసుకుంటోంది.

మొన్నటి గుజరాత్ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన తర్వాత భాజపాలోని రెండు వర్గాలు ఏకకాలంలో తమ ఆరోపణలు, విమర్శలను  ఒకేసారి పెంచేయటం దేనికి సంకేతాలో అర్ధం కావటం లేదు. పార్టీలోని ఎంఎల్సీ సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు బృందం మొదటి నుండి చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న విషయం అందరూ చూస్తున్నదే.

ప్రభుత్వం, పార్టీ అన్న తేడాలేకుండా ఎక్కడ దొరికితే అక్కడ చంద్రబాబును వాయించేస్తున్నారు. వీర్రాజైతే ఈమధ్య మరీ రెచ్చిపోతున్నారు. చంద్రబాబు పేరు చెబితేనే ఒంటికాలిపై లేస్తున్నారు. అటువంటిది వీర్రాజుకు తాజాగా మంత్రి మాణిక్యాలరావు తోడయ్యారు. తన నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో  జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబుపైనే రెచ్చిపోయారు. ఏకంగా చంద్రబాబుకే బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయటంపై ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా పెద్ద చర్చే జరుగుతోంది.

ఇక గవర్నర్ విషయానికి వస్తే విశాఖపట్నం ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు వరుసపెట్టి గవర్నర్ పై ఆరోపణలు చేస్తున్నారు. గవర్నర్ తెలంగాణా ప్రభుత్వం తరపునే మాట్లాడుతున్నట్లు మండిపడుతున్నారు. నరసింహన్ వైఖరి మార్చుకోకపోతే కేంద్రానికే ఫిర్యాదు చేస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఒకసారి కాదు పదే పదే గవర్నర్ కు హెచ్చరికలు జారీ చేస్తుండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

అంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర భాజపా ఏమన్నా వ్యూహం మొదలుపెట్టిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అదికూడా త్వరలో ప్రధాని-చంద్రబాబు భేటీ జరుగుతుందని అందరూ అనుకుంటున్న సమయంలోనే భాజపా నేతలు రెచ్చిపోతుండటం ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా ప్రతిపక్షం చేయాల్సిన పనిని మిత్రపక్షం భాజపానే చేస్తోంది. అంటే భాజపా స్వపక్షంలోనే ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. దాన్నే టిడిపి తట్టుకోలేకపోతోంది.  ఒకవైపు వైసిపిని తట్టుకోవటమే కష్టంగా ఉన్న సమయంలో భాజపాకూడా వైసిపి లాగే వ్యవహరిస్తుండటమే టిడిపి మింగుడుపడటం లేదు.