వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పాగా వేయటం కోసం వైసిపి ప్రత్యేకంగా కసరత్తులు చేస్తోంది. ఉత్తరాంధ్రలో మెజారిటీ స్ధానాలు గెలుచుకోవటంతో పాటు విశాఖపట్నం పార్లమెంటును గెలవటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు లక్ష్యాలు సాధించటం కోసం వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరికోరి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు.

విజయసాయి కూడా రాజ్యసభకు ఎన్నికైన తర్వాత విశాఖపట్నం జిల్లాను దత్తత తీసుకున్నారు. అందులో భాగంగానే విశాఖపట్నం లోక్ సభ స్ధానంపై దృష్టి పెట్టారు. వైజాగ్ పార్లమెంటు స్ధానంపై అంత ప్రత్యేకంగా దృష్టి పెట్టటం ఎందుకంటే, వైఎస్ కుటుంబం కోసమే అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ కుటుంబం నుండి విజయమ్మ లేదా షర్మిల ఎవరైనా పోటీ చేయవచ్చట.

ఇద్దరిలో ఒకరిని విశాఖపట్నం లోక్ సభ స్ధానంలో పోటీ చేయించటం ద్వారా మొత్తం ఉత్తరాంధ్రలో ఊపు తేవాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. విజయమ్మ పోయిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి కంభంపాటి హరిబాబు చేతిలో సుమారు లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. పోయిన ఎన్నికల్లో గెలుపు తధ్యమన్న అతినమ్మకం, ఎంఎల్ఏలుగా పోటీ చేసిన అభ్యర్ధుల మధ్య సమన్వయం లేకపోవటం, ఎలక్షనీరింగ్ సక్రమంగా లేదు. అలాగే పులివెందుల రౌడీలు, గుండాలు వైజాగ్ వాతావరణాన్ని నాశనం చేసేస్తారని పెద్ద ఎత్తున నెగిటివ్  ప్రచారంతో విజయమ్మ ఓడిపోయారు.

ఇక, షర్మిలైతే జనాల్లోకి చొచ్చుకుపోగలరు. గతంలో చేసిన పాదయాత్ర, రాజకీయ ప్రసంగాలు ఉపయోగపడతాయి. విజయమ్మతో పోల్చుకుంటే క్యాడర్ కూడా షర్మిలను బాగా రిసీవ్ చేసుకుంటారు.  అసెంబ్లీ అభ్యర్ధులను గనుక గట్టి వాళ్ళను ఎంపిక చేస్తే వైసిపి తరపున ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం జగన్ వైఖరిలో బాగా పరిణతి కనబడుతోంది.

చివరగా విజయసాయి విషయానికి వస్తే, ప్రత్యేకించి వైజాగ్ మీదే దృష్టి పెట్టారు. లోక్ సభ పరిధిలోని విశాఖ నగరంలోని ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ నియోజకవర్గాలతో పాటు పెందుర్తి, గాజువాక, భీమిలి నియోజకవర్గాల్లోనే ఎక్కువగా క్యాంప్ వేస్తున్నారు. అదే సమయంలో బిజెపి, టిడిపిలపై జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకత కూడా వైసిపికి కలిసి వచ్చే అవకాశముంది. మరి  జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.