కిలారు రాజేష్, లోకేష్ క్లాస్ మేట్స్. అంతకు మించి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. కిలారు రాజేష్ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతి నుంచి బాగా వినిస్తున్న పేరు.
అమరావతి : కిలారు రాజేష్.. లోకేష్ స్నేహితుడిగా అందరికీ తెలుసు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైన సందర్భంలో పరారీలో ఉన్నాడని వార్తలు కూడా వచ్చాయి. మళ్లీ ఇప్పుడెందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ-జనసేన కలిసి పోటీకి పోబోతున్న వేళ.. లోకేష్ చేసిన ఓ కామెంట్. చంద్రబాబే కాబోయే సీఎం అంటూ చేసిన కామెంట్ జనసేనలో కొంత కదలికకు కారణమయ్యింది. బాబును ముఖ్యమంత్రిగా చేయడం కోసం పవన్ ఎందుకు పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై పవన్ తేల్చంది ఒప్పుకోమని అంతర్గతంగా అసంతృప్తి వెల్లువెత్తుతూనే ఉంది. కాపు నేత హరిరామజోగయ్య దీనిమీద బహిరంగ లేఖ కూడా రాశారు.
ఈ సమయంలో టికెట్ల కొరకు ఆశించే టీడీపీ వారికి రూ.35 కోట్ల డిపాజిట్ కునుకు పట్టనివ్వడం లేదట. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఎదురవుతుండడంతో తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారట. టికెట్ కావాలంటే డిపాజిట్ కట్టాల్సిందే అనే కిలారు రాజేష్ పట్టుబడుతుండడంతో మళ్లోసారి ఆయన గురించి అంతా చర్చించుకుంటున్నారట. ఇంతకీ కిలారు రాజేష్ కు లోకేష్ కు ఉన్న అనుబంధం ఏంటి? జనసేన నేతకు కిలారు రాజేష్ కు పాత వైరాలు ఇప్పుడు అడ్డు రావా? యువగళం వెనకుంది ఎవరు? కిలారు రాజేష్ ను లోకేష్ ఎందుకంత నమ్ముతున్నాడు?
కిలారు రాజేష్, లోకేష్ క్లాస్ మేట్స్. అంతకు మించి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. కిలారు రాజేష్ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతి నుంచి బాగా వినిస్తున్న పేరు. 2014-2019లో జరిగిన అన్ని కుంబకోణాల్లోనూ ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 2014లో లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో కిలారు రాజేష్ షాడో మంత్రిగా పనిచేశారు. లోకేష్ పనులన్నీ ఆయనకు తెలియకుండా జరిగేవి కావట. కొన్ని విషయాల్లో లోకేష్ చంద్రబాబు నాయుడు కంటే కిలారు రాజేష్ చెప్పే మాటలనే విశ్వసిస్తాడని కూడా అంటారు. కిలారు రాజేష్ టీడీపీలో వివిధ పొజిషన్లలో పనిచేశాడు.
కిలారు రాజేష్ తో పాటు లోకేష్ కు అభీష్ట అనే మరో స్నేహితుడూ ఉండేవాడు. అతను కూడా లోకేష్ పార్టీలోకి రాకముందునుంచీ సన్నిహితంగా ఉండేవాడు. లోకేష్ పార్టీలోకి వచ్చిన తరువాత అభీష్ట, కిలారు రాజేష్ లు లోకేష్ ను అంటిపెట్టుకుని ఉన్నారు. ఇక 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక.. వీరిద్దరూ ముఖ్యులుగా మారిపోయారు. అయితే, అభీష్ట కొద్దికాలానికే రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడని అనేక ఫిర్యాదుల వెల్లువెత్తడంతో అతడిని పార్టీనుంచి తప్పించారు. అప్పటినుంచి కిలారు రాజేష్ లోకేష్ అడుగుజాడల్లో నడుస్తూ.. అంతా తానై చక్రం తిప్పుతున్నారు.
ఇక, కిలారు రాజేష్ పై గత ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ కనుసైగల్లో కిలారు రాజేష్ టీవీ9 వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీనిరాజుతో కలిసి తన మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కిలారు రాజేష్ అనే వ్యక్తితో కలిసి లోకేష్ అక్రమాలకు, అవినీతికి అలవాటు పడ్డారని విమర్శించారు. ఈ మేరకు శ్రీనిరాజు తెలుగుదేశంకు పార్టీ ఫండ్ ఇచ్చాడని చెబుతూ.. ఆధారాలతో ట్వీట్ కూడా చేశారు. ఆ సమయంలో కిలారు రాజేష్ పేరు విపరీతంగా వార్తల్లో నానింది. అలాంటిది ఇప్పుడు పవన్, టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. కిలారు రాజేష్ బారా ఖూన్ మాఫీ అయినట్టేనా అనే సందేహాలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు కిలారు రాజేష్ లోకేష్ తోనే కాదు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా బాగా క్లోజ్ అట. జూనియర్ ఎన్టీఆర్ మామ శ్రీనివాసరాజు సంస్థ అయిన స్టూడియో ఎన్ ను లీజుకు తీసుకుని కొద్ది రోజులు నడిపాడు. కానీ, సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం, సతాయించడం లాంటి చర్యలతో చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక మీడియాలో టీడీపీ వ్యవహారాలను డీల్ చేసేది కిలారి రాజేషే. ఆయనకు తెలంగాణలోనూ కొంతమంది నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. లోకేష్ కు ఏ కష్టం వచ్చినా నిమిషాల్లో వాలి పోతాడని పేరుంది.
ప్రస్తుతం లోకేష్ తరఫున అన్ని వ్యవహారాలు చూసేది కిలారి రాజేషే. ఇటీవల ముగిసిన యువగళం పాదయాత్ర నిర్వాహకుడిగా ఉన్నది కూడా కిలారి రాజేషే. మరో వాదన ప్రకారం లోకేష్ ను స్కిల్ స్కాం కేసులో అడ్డంగా ఇరికించింది కిలారు రాజేష్ అనే ఆరోపణలు కూడా వినిపిస్తాయి. స్కిల్ డెవల్మెంట్ కేసులో పక్కదారి పట్టిన 200 కోట్ల రూ. లు హవాలా రూపంలో కిలారి రాజేష్ ద్వారానే తిరిగి లోకేష్ కు చేరాయట. టీడీపీ అనుకూల ఎన్నారైలతో మంతనాలు చేయడం, పార్టీకి అనుకూలంగా ఉండేలా చూడడం కూడా రాజేష్ పనే.
పార్టీలో ఏదైనా పని జరగాలంటే చంద్రబాబునాయుడి దగ్గరికి వెళ్లడం కంటే రాజేష్ దగ్గరికి వెడితే ఈజీగా అవుతుందన్న టాక్ కూడా ఉందట. 2019లో టీడీపీ ఓటమితో కొంతకాలం దూరంగా ఉన్న రాజేష్ ఆ తరువాత లోకేష్ కు దగ్గరయ్యాడు. ఇప్పుడు కిలారు రాజకీయాలు తెలిసిన వారికి కిలారు రాజేష్ పేరు తెలియకుండా ఉండని పరిస్థితి. ఈ అతి చొరవ 2024 ఎన్నికలలో టిడిపి గెలుపుకు అడ్డంకి అవుతుందా అని ఆందోళన కూడా టీడీపీ వర్గాల్లో కనిపిస్తుంది.