వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఆమె నిజంగానే కాంగ్రెస్ లో చేరతారా? అన్నకు ఇచ్చిన మాట తప్పుతారా? అన్నకు గట్టి పోటీ ఇస్తారా? ఓట్లు చీల్చి ప్రతీకారం తీర్చుకునే వరకే పరిమితం అవుతారా?
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రాజకీయసమీకరణాలు మారుతున్నాయి. కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. పొత్తులు, ఎత్తులు, మార్పులు, చేర్పులతో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న పేరు వైఎస్ షర్మిల. ఏపీలో అసలు ఊసులో లేకుండా పోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల చేరికతో ఓ కొత్త కళ రానుందా? వైఎస్సార్ టీపీ పేరుతో తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి.. ఎన్నికల వరకు తీవ్రంగా పోరాడిన షర్మిల.. ఇప్పుడు ఏపీలో అడుగుపెడుతుందా? వైఎస్సార్టీపీని ఏం చేస్తారు?
అన్నకు ఇచ్చిన మాట తప్పి మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు షర్మిల వెడతారా? కాంగ్రెస్ లో చేరితే షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలవుతుందా? వైసీపీనుంచి షర్మిల వైపు ఎవరైనా వెడతారా? షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల వైసీపీకి ఎక్కువ నష్టమా? టీడీపీ-జనసేన పొత్తు మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? షర్మిల ఏపీలో రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఒక్కసారి చూద్దాం.
ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీని వీడతారా? అసంతృప్తి వెనుక అంతర్యమేమిటి?
వైఎస్ షర్మిల.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా, వైఎస్ జగన్ కు సోదరిగా తెలుసు. తండ్రిమరణం తరువాతి క్రమంలో వైఎస్ జగన్ మీద ఆరోపణలు, జైలుకు వెళ్లిన క్రమాల్లో అనేకసార్లు అన్నకు మద్దతుగా ఉన్నారు. అన్నకు సపోర్టుగా పాదయాత్రలు కూడా చేశారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత షర్మిలకు ఎంపీ సీటు ఇస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ కాలం గడిచింది కానీ అది నిజం కాలేదు.
అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తి తగాదాలు, పడడం లేదు అనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల సొంతంగా పార్టీ పెట్టాలనుకున్నారు. అలా వైఎస్సార్ టీపీ ఆవిర్భవించింది. పార్టీ ఆవిర్భావానికి ముందే ఏపీవైపు చూడనని అన్నకు హామీ ఇచ్చినట్టుగా కూడా అప్పట్లో వినిపించింది. ఇక వైఎస్సార్ టీపీ కింద తానూ తెలంగాణ ఆడపడుచునే అంటూ తెలంగాణలో కొద్దిరోజులు హల్ చల్ చేశారు.
కేసీఆర్, కేటీఆర్, బండిసంజయ్, ఎమ్మెల్యీ కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద విమర్శనాస్త్రాలు వేస్తూ.. నిరుద్యోగులకు అండగా ఉంటానంటూ.. రకరకాలుగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్సార్ టీపీ సొంతంగా పోటీ చేస్తుందా? లేదా? అనే డైలమా ఎక్కువయ్యింది. కాంగ్రెస్ లో చేరతారని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అసలు తాను పోటీలోనే లేనని ప్రకటించి.. పార్టీ క్యాడర్ ను తీవ్ర అసంతృప్తిలో పడేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ లోకి షర్మిల చేరకపోవడానికి రేవంత్ రెడ్డి కారణమని ఆ సమయంలో వినిపించింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో రాహుల్, సోనియాలతో షర్మిల భేటీ ఏ ఫలితాలనూ కన్పించనీయలేదు. ఇక మరోవైపు షర్మిలను ఏపీలో ప్రయోగిస్తారని అప్పటినుంచే టాక్ నడిచింది. ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ టాక్ ఎక్కువయ్యింది.
నిజానికి షర్మిల కాంగ్రెస్ లో చేరతారా? ఆమెకు ఏపీసీసీ అధ్యక్షురాలి పదవి కట్టబెడతారా అనేది పక్కన పెడితే... షర్మిల కాంగ్రెస్ లో చేరే అవకాశాలు 20 శాతం మాత్రమే ఉన్నాయి. ఓ వైపు సొంతపార్టీ, మరోవైపు అన్నకిచ్చిన మాట.. ఈ రెండింటి మధ్య ఆమె చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.
ఇక షర్మిల కనక కాంగ్రెస్ లో చేరితే.. వైసీపీకే నష్టం అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటికే వైపీసీలో మార్పులు, చేర్పులు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. మొదటినుంచి వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న అనేకమంది సీనియర్ నాయకులు అసహనంతో ఉన్నారు. కొంతమంది పార్టీనుంచి తప్పుకున్నారు కూడా. వారంతా షర్మిలతో కలిసే అవకాశం ఉంది.
వీరిలో జగన్ కు దగ్గరగా ఉండే వ్యక్తులైన నెల్లూరు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి, మంగళగిరినుంచి ఆర్కే, మైలవరపు ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్.. వీళ్లంతా షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ లోకి తిరిగి రావడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బాలినేని కూడా రానున్న కాలంలో షర్మిల పక్కన చేరే అవకాశం ఉంది. మరోవైపు తండ్రి హత్య కేసులో జగన్ మీద తీవ్ర ఆరోపణలు చేసిన వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత కూడా షర్మిల కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయి.
వీటివల్ల వైసీపీ ఓటు బ్యాంకుకే తూటు పడుతుంది. వైసీపీ ఓట్లు చీలడం అంతిమంగా టీడీపీ-జనసేన కూటమికి లాభించే అవకాశం ఉంది. మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ లకు కూడా ఈ సారి టికెట్ దక్కకపోవచ్చన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. టికెట్ రాకపోయినా వీరు మాత్రం పార్టీ మారే అవకాశం లేదని తెలుస్తోంది. టికెట్ దక్కకపోతే నిశ్శబ్దంగా పార్టీలోనే పనిచేస్తారని సమాచారం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు కాంగ్రెస్ లో ఉండి.. పార్టీ ఆవిర్భావం తరువాత వైసీపీలోకి వచ్చిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాత్రమే కాంగ్రెస్ లోకి తిరిగి వెడతారు. వైఎస్సార్ సీపీతో రాజకీయాల్లోకి వచ్చిన వారు మాత్రం జగనన్నకే విధేయులుగా ఉంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి నిజంగానే వైసీపీకి చెల్లె గండం ఉందా? షర్మిల కాంగ్రెస్ లో చేరతారా? తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
