Asianet News TeluguAsianet News Telugu

కేశినేని నాని రూట్ ఎటూ ? టార్గెట్ చంద్రబాబేనా??

పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కేశినేని నాని చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయనున్నట్లు సమాచారం. పార్టీలో ఉంటూ అధినాయకత్వంపై విమర్శలు సరికాదనే ఆలోచనలో కేశినేని నాని ఉన్నారని తెలుస్తోంది. దీంతో కేశినేని నాని రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా? లేక ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారా అనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Which party will Kesineni Nani join? - bsb
Author
First Published Jan 6, 2024, 6:53 AM IST

విజయవాడ : టీడీపీలో కేశినేని బ్రదర్స్ ఫైట్ మరో టర్న్ తీసుకుంది. కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు కేశినేని నాని. రెండు రోజుల్లోనే విజయవాడ టీడీపీలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కేశినేని నాని త్వరలోనే లోక్ సభ సభ్యత్వానికి, వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని.. లోక్ సభ స్పీకర్ ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పిస్తానన్నారు. 

అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు నా అవసరం లేదని భావించారు. ఇంకా నేను పార్టీలో కొనసాగడం సరికాదు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు కేశినేని నాని విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు కూడా. అసలింతకు గొడవేంటి? కేశినేని నాని పార్టీకి రాజీనామా చేయాలనుకోవడానికి కారణం ఏంటి? కేశినేని నాని వేరే పార్టీలో చేరతారా? సొంతంగా పోటీకి దిగుతారా?

విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ నేత, ఆయన తమ్ముడు కేశినేని చిన్నిల మధ్య కొంతకాలంగా తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇటీవల తిరువూరులో చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల విషయంలో ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. పార్టీ ఆఫీసులో నాని, చిన్ని వర్గాలకు చెందిన వారు కొట్టుకున్నారు. దీంతో సీరియస్ అయిన అధిష్టానం.. కేశినేని నానికి ఈ సారి టికెట్ లేదని తేల్చి చెప్పింది.

Keshineni Nani:కేశినేని నాని సంచలన నిర్ణయం.. త్వరలో పార్టీకి ..!

అది కూడా నేరుగా నానితో మాట్లాడలేదు. కొంతమంది నాయకులను నాని దగ్గరికి పంపి మాట్లాడించింది. మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నెట్టం రఘురాం, మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులతో సమాచారం పంపింది. వారు ఆయనను కలసి 7వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జ్ గా చంద్రబాబు నియమించారని... ఆ విషయంలో చిన్నీని కలగ చేసుకోవద్దని చెప్పమన్నారని చెప్పారు. 

రాబోయే ఎన్నికలో చిన్నీ స్థానంలో విజయవాడ లోకసభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి, ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. దీంతో శుక్రవారం ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నాని ప్రకటించారు. అధినేత ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని నాని తెలిపారు. చంద్రబాబు ప్రతిపాదనను అంగీకరిస్తూ తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు ట్వీట్ చేశారు. 

ఆ తరువాత కొద్ది గంటల్లోనే తాను ఈ సారి బరిలో ఉంటానని చెప్పారు. ఎన్నికలకు చాలాముందే తనకు టికెట్ ఇవ్వని విషయం తేల్చిన అధిష్టానానికి థ్యాంక్స్ చెప్పారు. నామినేషన్ ముందురోజు వరకూ నాన్చకుండా, ఇప్పుడే తేల్చేశారన్నారు. తానింకా పార్టీ వీడే ఆలోచనలో లేనని, కార్యకర్తలు, అనుచరులు ఏది చెబితే అది చేస్తానని.. అందుకే పార్టీ ఆఫీసులో జెండాలు మారలేదని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఇలాగే బురద జల్లారని..ఇప్పుడాయన సీఎం అయ్యారని అన్నారు. తనమీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వారి గురించి బయటపెడతానన్నారు. ఇక శనివారం ఉదయానికి సీన్ మారిపోయింది. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. 

ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కేశినేని నాని చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయనున్నట్లు సమాచారం. పార్టీలో ఉంటూ అధినాయకత్వంపై విమర్శలు సరికాదనే ఆలోచనలో కేశినేని నాని ఉన్నారని తెలుస్తోంది. దీంతో కేశినేని నాని రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా? లేక ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారా అనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

మరోవైపు కేశినేని నానికి వైసీపీ, బీజేపీలోని పలువురు ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. వైసీపీకి చెందిన కొడాలి నాని, వసంత క్రిష్ణ ప్రసాద్ లతో మంచి రిలేషనే ఉంది. ఇటీవల గొడవకు ముందు వైసీపీ వారితో నాని బాగా కలుస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపించాయి. ఇక బీజేపీలోని ముఖ్యనేతలైన అమిత్ షా లాంటి వారితో కూడా నానికి మంచి సంబంధాలే ఉన్నాయి. 

దీంతో ఇప్పుడు నాని వైసీపీలో చేరతారా? బీజేపీలో చేరతారా? ఒకవేళ నాని పార్టీనుంచి బైటికి వస్తే టీడీపీకి జరిగే నష్టం ఎంత? గెలుపే లక్ష్యంగా పొత్తులతో ముందుకు వెడుతున్న టీడీపీకి నానీ మార్పు తలనొప్పిగా అవుతుందా? అనే అంశాలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. ఏపీలో క్షణక్షణానికి మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఇదెక్కడికి దారితీస్తుందో.. కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios