ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ మళ్లీ బలం పుంజుకోవాలని చూస్తోన్న కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ ఇచ్చే పరిణామాం ఇవాళ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.... ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఈ పరిణామం ముందు నుంచి ఊహించిందే.. కిరణ్  చేరికతో భూస్థాపితమైన ఏపీ కాంగ్రెస్‌లో చిన్న కదలిక వచ్చిందన్నది వాస్తవం.

రాష్ట్ర విభజనను ఆపలేకపోయినప్పటికీ.. కిరణ్ సమర్థతపై ప్రజలకు ఏ మూలనో నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని, జగన్‌, చంద్రబాబుతో పాటు అంతర్గత కుమ్ములాటలను ఎదుర్కొని ఆయన పరిపాలనను గాడిలో పెట్టారని చాలామంది విశ్వసించారు. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్  ఏపీ కాంగ్రెస్‌కు మంచి చేస్తాయని అధిష్టానం భావిస్తోంది. ఈయను చూసి పార్టీని వీడిన మరికొందరు దిగ్గజాలు సొంతగూటికి వస్తారని హైకమాండ్ భావన.

సరే అంతా బాగానే ఉంది.. ఇప్పుడు కిరణ్‌కు ఏ బాధ్యత కట్టబెడతారు అనేది విశ్లేషకుల మెదళ్లను తొలిచేస్తోంది. ఏపీసీసీ అధ్యక్షుడిని ఇప్పట్లో మార్చలేరు.. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలకు కొత్త బాధ్యుడు వచ్చేశాడు. మరి ఏరి కోరి వెంటపడి తెచ్చుకున్న వ్యక్తికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి కదా..? ఎందుకంటే కిరణ్ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి.. దీనిపై పలు వాదనలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్  పరిస్థితి ఆశాజనకంగా లేదు కాబట్టి.. జాతీయ రాజకీయాల్లో  కీలకపాత్ర పోషించాలని కిరణ్ భావిస్తున్నారట. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాని ఆయనకు కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్‌లోనే కాంగ్రెస్  పార్టీని  తిరిగి గాడిలో పెట్టే అవసరాలకే కిరణ్‌ను ఆ పార్టీ ఉపయోగించుకోవాలని చూస్తోంది.. కాకపోతే.. ఇప్పుడు ఆయన డిమాండ్‌ను పట్టించుకోవాలని.. ఆ తర్వాతే ఏపీ రాజకీయాల్లోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందని ఏఐసీసీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.