Asianet News TeluguAsianet News Telugu

కేబినెట్ భేటీ: సాధారణంగా అయితే చంద్రబాబుదే నిర్ణయం, కానీ..

 సీఎం సూచించిన  తేదీ  మేరకు  కేబినెట్ సమావేశం ఏర్పాటు కోసం సీఎస్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.  కేబినెట్  సమావేశంలో  ఎజెండా ఏర్పాటుకు సంబంధించి తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే

what is the process to conduct cabinet meeting
Author
Amaravathi, First Published May 7, 2019, 12:52 PM IST

అమరావతి:   సీఎం సూచించిన  తేదీ  మేరకు  కేబినెట్ సమావేశం ఏర్పాటు కోసం సీఎస్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.  కేబినెట్  సమావేశంలో  ఎజెండా ఏర్పాటుకు సంబంధించి తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే. కానీ, ఈ ఎజెండా‌కు సంబంధించిన సమాచారాన్ని సచివాలయ వర్గాలు సేకరిస్తాయి.

సచివాలయ బిజినెస్ రూల్స్ ప్రకారంగా కేబినెట్ భేటీకి సంబంధించి ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయం ప్రకారంగా అధికారులు నడుచుకోవాల్సి ఉంటుంది. ఏ రోజున ఏ సమయానికి  కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలనే దానిపై సీఎం నుండి లేదా సీఎంఓ నుండి సీఎస్ కు  సమాచారం అందుతోంది.

సీఎం‌ఓ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల నుండి సమాచారాన్ని సేకరించాలసి జీఎడీ పొలిటికల్ సెక్రటరీకి సీఎస్ నుండి ఆదేశాలు అందుతాయి. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఆయా శాఖల్లో ప్రధానంగా ఉన్న సమస్యలను ఎజెండాలో చేర్చేందుకు వీలుగా ప్రతిపాదనలను పంపాలని జీఎడీ నుండి సర్క్యులర్ పంపుతారు.

ఈ సర్క్యులర్ ఆధారంగా  పలు శాఖల నుండి  కేబినెట్ ఎజెండాలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు వస్తాయి.ఈ ప్రతిపాదనలను సీఎస్ సీఎం దృష్టికి తీసుకెళ్తారు. అయితే కేబినెట్ ఎజెండాలో ఏఏ అంశాలు ఉండాలనే విషయమై సీఎందే తుది నిర్ణయం.

గతంలో తీసుకొన్న నిర్ణయాలకు సంబంధించిన ర్యాటిఫికేషన్‌ లేదా కొత్త ప్రతిపాదనలు ఇతరత్రా అన్ని అంశాలను కేబినెట్‌ ఎజెండాలో  సీఎం నిర్ణయం మేరకు చోటు దక్కుతోంది.

అయితే ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో  మాత్రం సాధారణ పరిపాలనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. కొత్త పథకాలు ఇతరత్రా వాటికి కేబినెట్ ఆమోదం తెలపకూడదు. ఒకవేళ తెలిపినా కూడ ఈసీ వాటిని అడ్డుకొనే ఛాన్స్ ఉంటుంది.

ఈ నెల 10వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. మరో వైపు సాధారణ పరిపాలనకు సంబంధించి కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి అవసరం లేదని అధికార పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

ఈ నెల 10వ తేదీన కేబినేట్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ  సీఎంఓ నుండి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యానికి నోట్ వెళ్లింది. కేబినెట్ విషయమై సీఎస్ ఏం నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

కేబినేట్ : అధికారులతో సీఎస్ అత్యవసర భేటీ

చంద్రబాబు ఆఫీస్ నుంచి నోట్: ఎల్వీ రియాక్షన్ మీదే ఉత్కంఠ

క్యాబినెట్ భేటీ: చంద్రబాబుకు పరీక్ష, అధికారులు డుమ్మా?

Follow Us:
Download App:
  • android
  • ios