పార్టీలో చేరగానే సరిపోదు. సుదీర్ఘకాలం పాటు నిలదొక్కుకునే సామర్ధ్యముండాలి. జయపద్ర, శారద, కైకాల సత్యనారాయణ, కవిత వాళ్ళందరికీ ఓ సారూప్యముంది. వాళ్ళంతా సినిమా తారలన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఎన్టీఆర్ హయాంలో పై తారలకు బాగానే ప్రధాన్యత దక్కింది. ఎప్పుడైతే పార్టీ పగ్గాలు చంద్రబాబునాయుడు చేతికి వచ్చాయో క్రమంగా ప్రదాన్యత కోల్పోయారు. చివరకు పార్టీనే వదిలిపెట్టేసారు. పార్టీలో తమకు ప్రాధన్యత ఉండటం లేదని ఎంత మొత్తుకున్నా కైకాల, కవితలు ఎంత మొత్తుకుంటున్నా  పట్టించుకున్న నాదుడే లేరు. 

ఇదంతా ఎందుకంటే, అలనాటి అందాల తార వాణి విశ్వనాధ్ టిడిపిలో చేరటానికి తెగ ఉబలాట పడిపోతున్నారు. ఎప్పుడెప్పుడు రంగంలోకి దూకేద్దామా అన్న ఆతృత కనబడుతోంది వాణిలో. పైగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి నగిరి నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసేసుకున్నారట. ఇప్పటికే నియోజకవర్గంలోని నేతలతో రెండుసార్లు సమావేశం జరిపారు. అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి టిడిపిలో చేరటం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించటానికి ఎంత ఆతృత పడుతున్నారో అర్ధమైపోతోంది.

ఇక్కడే పార్టీలోని పలువురు సీనియర్ నేతలు వాణి విశ్వనాధ్ వైఖరిపై ఆశ్చర్యపోతున్నారు. టిడిపి పెట్టిందగ్గర నుండి సినిమా తారల సందడి నేతలకు కొత్తేమీ కాదు. కాకపోతే ఎంతకాలమన్నదే ప్రశ్న. తాజాగా వాణి విశ్వనాధ్ విషయంలో కూడా అదే చర్చ జరుగుతోంది. వాణి ఆశించినట్లుగా వచ్చే ఎన్నికల్లో నగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం వస్తుందో రాదే ఇపుడే చెప్పలేం. ఎందుకంటే, అక్కడ బలమైన నేత గాలి ముద్దుకృష్ణమనాయుడున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంతో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూనే ఉన్నారు. అటువంటిది గాలిని కాదని చంద్రబాబు వాణీకి టిక్కెట్టు ఇస్తారా అన్నది అనుమానమే.

భౌగోళిక పరిస్ధితులు తనకు అనుకూలంగా ఉంటాయన్న కారణంతోనే వాణి నగిరిని ఎంచుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నగిరి నియోజకవర్గంపై ఎక్కువగా తమిళనాడు ప్రభావం ఉంటుంది. జనాలు కూడా తెలుగు కన్నా ఎక్కువగా తమిళమే మాట్లాడుతారు. కాబట్టి వాణికి భాషా సమస్య కూడా ఉండదు. అంతా బాగానే ఉంది కానీ పార్టీలో ఒకపుడు వెలుగు వెలిగిన తన సీనియర్ల  ప్రస్తుత పరిస్ధితేంటో వాణి ఒకసారి తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే, అవసరానికి వాడుకుని తర్వాత వదిలేయటంలో చంద్రబాబునాయుడుకున్న రికార్డు మరెవ్వరికీ లేదు.