సీపీఎస్ అంటే ఏమిటీ: పవన్, జగన్ హమీ అమలు సాధ్యమేనా?

What is CPS: Is it possible to comeout?
Highlights

సీపీఎస్ స్కీమ్ తో ఉద్యోగులకు షాక్

అమరావతి: సీపీఎస్ పెన్షన్ స్కీమ్‌పై ఉద్యోగ సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేస్తామని చెబుతున్నారు. ఉద్యోగ సంఘాలు ఈ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీపీఎస్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు తీవ్రమైన ఇబ్బందులను తెచ్చిపెడుతోందని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి.

సీపీఎస్ పెన్షన్ స్కీమ్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)  పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 2003 చివర్లో అప్పటి వాజ్‌పేయ్ ప్రభుత్వం ఈ పధకానికి  నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ స్కీమ్ ను 2004లో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం అమలు చేసింది. 


సీపీఎస్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి రాకముందు ఉద్యోగుల జీతాల నుండి పెన్షన్ కోసం పైసా కూడ కట్ చేసేవారు కాదు. కానీ, కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతీ ఉద్యోగి జీతం నుండి కనీసం 10 శాతాన్ని పెన్షన్ స్కీమ్ కోసం కట్  చేస్తున్నారు.

ఉద్యోగుల వేతనాల నుండి కట్ చేసిన నిధులను షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే షేర్ మార్కెట్లలో పెట్టుబడులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతిల్లోకి వెళ్తాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయంతో ఉన్నారు. పాత పెన్షన్ స్కీమ్ లో అయితే పెన్షన్ కోసం ఒక్క పైసా కూడ ఉద్యోగి వేతనం కూడ కట్ చేసేవారు కాదు. 

పాత పెన్షన్ స్కీమ్ పద్దతిలోనే ఉద్యోగులు ప్రయోజనం పొందేవారని ఉద్యోగ సంఘాలు అభిప్రాయంతో ఉన్నాయి. ఉద్యోగి బేసిక్ వేతనంలో  7 ఏళ్ళ పాటు సగం జీతాన్ని పెన్షన్ రూపంలో చెల్లించేవారు. ఆ తర్వాత 30 శాతం పెన్షన్ గా చెల్లించేవారు.

కానీ సీపీఎస్ విధానం ద్వారా  ఉద్యోగులకు పెన్షన్ అతి తక్కువగా పొందే అవకాశం ఉంది.  అతి తక్కువ మొత్తాన్ని ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ గా పొందనున్నారని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.

సీపీఎస్ పెన్షన్ స్కీమ్ సంబంధించిన విషయమై 2013 వరకు చట్టం కాలేదు. 2004లో యూపీఏ తొలిసారిగా అధికారంలో ఉన్న కాలంలో వామపక్షాలకు పార్లమెంట్ లో గణనీయంగా ఎంపీలు ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీలకు ఎంపీల సంఖ్య తగ్గింది. వామపక్షాలు సంఖ్య తగ్గడంతో 2013 అక్టోబర్ మాసంలో ఈ స్కీమ్ ను చట్టంగా మారింది.


పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ యాక్ట్ కు 2013 ఆగష్టులో చట్టం అయింది. కాంగ్రెస్ కు ఆనాడు బిజెపి మద్దతుగా నిలిచింది. ఈ లోక్‌సభలో ఓటు చేసింది చట్టరూపంగా
మార్చింది.అయితే ఈ చట్టంలో చేరడానికి ఆసక్తి ఉన్న రాష్ట్రాలు చేరవచ్చని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది.

అయితే ఇప్పటివరకు త్రిపుర, బెంగాల్ రాష్ట్రాలు మాత్రమే చేరలేదు. త్రిపురలో ఇప్పటివరకు వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు ఈ స్కీమ్ లో చేరలేదు. బెంగాల్ లో
వామపక్షాలు బలంగా ఉన్నందున వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోందనే కారణంతో మమత కూడ ఈ స్కీమ్ లో చేరలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

సీపీఎస్ స్కీమ్ నుండి చేరడమే కానీ బయటకు వచ్చే అవకాశం కూడ  రాష్ట్రాలకు లేదనే అభిప్రాయాలను కూడ వ్యక్తం చేసే వారు కూడ ఉన్నారు. అయితే ఉద్యోగుల పెన్షన్ రాష్ట్ర
ప్రభుత్వాలకు చెందిన వ్యవహరమని ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ యూటీఎప్ రాసిన లేఖకు సమాధానం ఇచ్చినట్టుగా ఆ సంఘ నేత నర్సిరెడ్డి చెప్పారు.


ఈ స్కీమ్ నుండి వైదొలిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటే కేంద్రానికి లేఖ రాస్తే ఆ దిశగా చర్యలు తీసుకొనే అవకాశాలు లేకపోలేదని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు
చెబుతున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే ఛత్తీస్ ఘడ్, మహరాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఈ స్కీమ్ నుండి బయటకు రావాలని యోచిస్తున్నాయి. కానీ, ఎలా ముందుకు వెళ్ళాలనే అంశంపై ఆలోచిస్తున్నాయి. ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో సీపీఎస్ స్కీమ్ లో ఆ రాష్ట్రం చేరింది. కానీ, ఈ స్కీమ్ నుండి బయటకు రావాలని కేరళ సర్కార్ ప్రస్తుతం భావిస్తోంది. ప్రస్తుతం కేరళలో సీపీఎం నేతృత్వంలోని సర్కార్ ఉంది. సీపీఎస్ నుండి బయటకు రావడానికి అవకాశాలను పరిశీలించేందుకు కేరళ ప్రభుత్వం కమిటిని ఏర్పాటు చేసింది.

ఈ పథకం నుండి బయటకు రావాలని కోరుకొనే రాష్ట్రాలు కనీసం ఇప్పటివరకు కమిటీలు కూడ వేయని పరిస్థితి ఉందని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ స్కీమ్ నుండి బయటకు రావాలనే రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకొంటే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

loader