ఇప్పటి వరకు ట్రాఫిక్ రూల్స్ ఒకలా ఉన్నాయి... ఇప్పుడు మరోలా ఉన్నాయి. అంతక ముందు వరకు ట్రాఫిక్ ఛలానాలు చాలా తక్కువగా ఉండేవి. గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసకువచ్చిన కొత్త నిబంధనలతో వాహనదారులకు దిమ్మ తిరిగిపోయింది. భారీ ట్రాఫిక్ ఛలానాలు విధించడంతో.. ప్రజల్లో కాస్త భయం, బాధ్యత పెరిగిపోయాయి. అన్ని రూల్స్ పాటించడానికే ప్రయత్నిస్తున్నారు.

తాజాగా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారుల కోసం సరికొత్త నియమం తీసుకువచ్చింది.  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బయటకు మీ వాహనం తీశారో... ఇక మీరు జైలుకు వెళ్లకతప్పదు.  2019లో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88,872మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుపడ్డారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు సేఫ్టీ పై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీ లైసెన్సులు లేకుండా బండి నడిపేవారిని జైలుకు పంపాలని రైల్వేశాఖకు సూచించింది.

దీంతో ఏపీ రవాణాశాఖ కఠిన  చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలను 20శాతం తగ్గించాలనే ఉద్దేశంతో పోలీసులతో కలిసి సంయుక్తంగా డ్రైవింగ్ లైసెన్సుల తనిఖీలను ముమ్మరంగా చేపట్టనున్నారు.

మరోవైపు లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం విద్యార్హతను తొలగించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే ఎనిమిదో తరగతి నిబంధనను ఏపీ ప్రభుత్వం తొలగించింది. అంతేకాకుండా సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ట్రాకులు కూడా త్వరలోనే అందుబాటులోకి రానుండటంతో వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సులు పొందడం సులభంగా మారింది.