మోడి నిర్ణయాన్ని బహిరంగంగా సమర్ధించలేక, టిడిపిపై ఎదురుదాడి చేయలేక అవస్తలు పడుతున్నారు.
పెద్ద నోట్ల రద్దు విషయంలో ఏపి కమలం పార్టీ నేతల పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలుకల్లా తయారైంది. ప్రధానమంత్రి నిర్ణయంపై దేశమంతా తీవ్ర ఆందోళనలో ఉన్నా రాష్ట్రంలోని భాజపా నేతలకు కళ్ళు, చెవులు పనిచేయటం లేదా అనుమానం వస్తోంది. లేకపోతే ఏవైనా అదృశ్య శక్తులు వారి నోళ్ళు మూసేసాయా అన్న విషయం తెలియటం లేదు.
పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మిత్రపక్షం చేస్తున్న విమర్శలకు కమలం పార్టీ నెతలెవరూ కనీసం స్పందించటం కూడా లేదు. మోడి నిర్ణయాన్ని బహిరంగంగా సమర్ధించలేక, టిడిపిపై ఎదురుదాడి చేయలేక అవస్తలు పడుతున్నారు.
నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుతో సహా టిడిపి మంత్రులు, నేతలు విమర్శలు చేస్తున్నా కమలం నేతలెవరూ ఎందుకు స్పందించటం లేదో ఎవరికీ అర్ధం కావటం లేదు. రాష్ట్రంలో భాజపాకు పూర్తిస్ధాయి కార్యవర్గముంది.
ఏకంగా చంద్రబాబు విధానాలపైనే విరుచుకుపడగలిగిన నేతలూ ఉన్నారు. దానికితోడు మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలుండి కూడా టిడిపి విమర్శలకు ఎవరూ స్పందిచటం లేదంటే, టిడిపికి సమాధానం చెప్పటానికి భయపడుతున్నారో లేక మోడి నిర్ణయం తప్పని అనుకుంటున్నారో.
