రామోజీ మరణంపై జగన్ ఏమన్నారంటే..?
Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. పలువురు ప్రముఖులు ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీ రావు మరణ వార్త తెలుసుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు.
Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.
మీడియా మొఘల్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇకలేరు. కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన... శనివారం తెల్లవారుజామున కన్నమూశారు. ఈ నెల 5న రామోజీరావుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా,రామోజీరావు పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలోని నివాసానికి తరలించారు.