ట్రూ అప్ చార్జీలపై నోరెత్తరేం?: కాకాణి
ట్రూ అప్ చార్జీలు ఎత్తేస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారని మాజీ మంత్రి కాకాణి గుర్తుచేశారు. ఆ విషయాన్ని మీడియా అడిగినా తీసివేస్తాననే మాట మాట్లాడలేదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంధన రంగంపై అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. బాబు నోటి నుంచి వచ్చిన ప్రతి మాటా పచ్చి అబద్ధమన్నారు. ఆయన చేయని వాటిని కూడా తన గొప్పలుగా చెప్పుకున్నారని మండిపడ్డారు. విద్యుత్ రంగంలో చంద్రబాబు నిర్ణయాల వల్ల డిస్కంలు మూతపడ్డాయన్నారు. కోవిడ్ సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సంక్షోభాలను దాటుకుని జగన్మోహన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని గాడిలోపెట్టారని చెప్పారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి… విద్యుత్తుపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై స్పందించారు.
అసత్యాల ప్రదర్శన
చంద్రబాబు తాను చేయని వాటిని తన గొప్పలుగా చెప్పుకున్నారని కాకాణి విమర్శించారు. ఇంధన రంగంపై చంద్రబాబు ప్రెజెంటేషన్ పూర్తిగా అసత్యాలమయమన్నారు. ప్రజలకు విద్యుత్ పంపిణీ గురించి తెలియజేయడం కన్నా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి పనిగట్టుకుని ప్రెజెంటేషన్ ఇచ్చారన్నారు. 2014-15 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు 59,198 మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేదని.... 2018-19 అంటే చంద్రబాబు దిగిపోయేనాటికి 63,675 మిలియన్ యూనిట్లకు డిమాండ్ పెరిగిందన్నారు. కేవలం సగటున 1.9 శాతం వృద్ధి రేటు ఉందన్నారు. కొత్త కనెక్షన్లు ఇవ్వలేదన్నారు. డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేస్తూ వచ్చారన్నారు. జాతీయ సగటు వృద్ధి రేటు 4.5 శాతం ఉందని, జాతీయ వృద్ధి రేటులో దాదాపు మూడో వంతుకు ఆంధ్ర రాష్ట్రం పడిపోయిందన్నారు.
2014-19 మధ్యలో వినియోగం దాదాపుగా 36 శాతం పెరిగిందని కాకిలెక్కలు కట్టి చంద్రబాబు డబ్బా కొట్టుకున్నారన్నారు. మొత్తం తీసుకున్నా 7.6 శాతానికి పరిమితమయ్యందని గుర్తుచేశారు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దాదాపుగా 25శాతం డిమాండ్ పెరిగినట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్టు ఇచ్చిందన్నారు. ఇది వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు.
2023-24 నాటికి 80,151 యూనిట్లకు డిమాండును పెంచుకోగలిగామన్నారు. అంటే దాదాపు 25 శాతం డిమాండ్ పెరిగిందని, సగటున ఏడాదికి వృద్ధి రేటు 4.7 శాతం ఉందన్నారు. 2019-24 మధ్య జాతీయ సగటు 4.9 శాతం ఉంటే, అది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల సగటున 4.7 శాతానికి పెరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో కోవిడ్ లేదని, ఉక్రెయిన్ వార్ లేదని, కోల్ సప్లయ్ లో సమస్యలు లేవని, అంతర్జాతీయంగా సరఫరాలో సమస్యలు లేకపోయినా చంద్రబాబు హయాంలో పెరిగిన డిమాండ్ 7.6 శాతమైతే... వీటన్నింటినీ అధిగమించి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చింది 25 శాతం పెరిగిందని వివరించారు.
ఆ హామీలపై మాట్లాడరా?
ట్రూ అప్ చార్జీలు ఎత్తేస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారని మాజీ మంత్రి కాకాణి గుర్తుచేశారు. ఆ విషయాన్ని మీడియా అడిగినా తీసివేస్తాననే మాట మాట్లాడలేదన్నారు. ఇది కూడా మాయ, మోసమని వివరించారు. 2014-19 చంద్రబాబు హయాంలో ఏపీఎస్పీడీసీఎల్‌కు సంబంధించి రూ.13,255 కోట్లు మాత్రమే సబ్సిడీ రూపంలో ఇవ్వగలిగారన్నారు. జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య సబ్సిడీకి సంబంధించి రూ.47,800 కోట్లు ఇచ్చారన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి మీటర్లు పెట్టకూడదని మాట్లాడారని, ఇప్పుడు వాటిపై ఎందుకు దాటవేశారని ప్రశ్నించారు. మీటర్లు బిగించడం లేదని స్టేట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.