Asianet News TeluguAsianet News Telugu

వీక్లీ రౌండప్: ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్, రాజధాని-వరదల చుట్టూనే రాజకీయాలు, కోడెలకు హార్ట్ ఎటాక్

అమరావతి రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ టాపిక్ గా మారాయి. బొత్స వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలతోపాటు విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భిన్న వ్యాఖ్యలు చేసింది. కొందరు బొత్స వ్యాఖ్యలను సమర్థిస్తే మరికొందరు వక్రీకరించారంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు.

 
 

weekly roundup news in andhrapradesh: amaravathi capital, krishna floods hot topic issues
Author
Amaravathi, First Published Aug 25, 2019, 8:01 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ శాఖ మంత్రి, రాజధాని అమరావతిని పర్యవేక్షిస్తున్న బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. రాజధానిపై ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయంటూ చేసిన బొత్స వ్యాఖ్యల చుట్టూనే రాజకీయాలు తిరిగాయి. 

అమరావతి రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ టాపిక్ గా మారాయి. బొత్స వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలతోపాటు విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భిన్న వ్యాఖ్యలు చేసింది. కొందరు బొత్స వ్యాఖ్యలను సమర్థిస్తే మరికొందరు వక్రీకరించారంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. 

మరోవైపు ఏపీ అసెంబ్లీలో ఫర్నీచర్ మాయం అంశం కూడా ఈ వారం హాట్ టాపిక్ గా మారింది. కేసులు, రాజకీయ విమర్శల ధాటితో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హార్ట్ ఎటాక్ కు గురయ్యారు. దాంతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. 

రాజధాని ప్రాంతంలో వరదలు రావడంపై విశాఖపట్నంలో ఈనెల 20న సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ విషయమై విధాన ప్రకటన చేయనున్నామని కూడా స్పష్టం చేశారు. 

ముంపు ప్రాంతం కావడంతో అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. సాధారణ వ్యయం కంటే అమరావతిలో ఎక్కువ ఖర్చు అవుతోందని తేల్చి చెప్పారు. అంతేకాదు రాజధాని ప్రాంతంలో ఫైఓవర్లు, భారీ కట్టడాలు కట్టాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఫలితంగాప్రజాధనం దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉందన్నారు. 

కృష్ణా వరదల నేపథ్యంలో అమరావతిలోని కొన్ని ప్రాంతాలు నీటమునిగాయి. వరదలు వస్తేనే ఈ ప్రాంతం మునిగిపోతుందని గతంలో 2009లో కూడా ఈ ప్రాంతం ముంపుకు గురైందని చెప్పుకొచ్చారు.

దాని నుంచి రాజధానిని కాపాడాలంటే కాలువలు, డ్యామ్ లను నిర్మించాల్సిన అవసరం ఉందని బొత్స సత్యనారాయణ చెప్పారు. వరద నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం కూడా ఉందని క్లారిటీ ఇచ్చేశారు.  

మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. సాక్షాత్తు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజధానిని తరలిస్తున్నారంటూ ఆరోపించారు.

రాజధానిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందంటూ తాము చేసిన ఆరోపణలకు బొత్స వ్యాఖ్యలే నిదర్శనమని ఆరోపించారు. రాజధాని కోసం ఎంతవరకైనా పోరాడతానని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 

ఇకపోతే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అయితే ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావులాంటి నేతలు అయితే వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగానే హెచ్చరించారు. రాజధానిని కడప జిల్లాకు తరలించుకుపోతారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బూరగడ్డ వేదవ్యాస్ అయితే మరో అడుగు ముందుకు వేశారు. వైయస్ జగన్ అమెరికావెళ్తూ దొనకొండలో రాజధానిని తరలిస్తున్నామని దొనకొండలో భూములు కొనుగోలు చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆదేశించారని చెప్పుకొచ్చారు. 

కొందరికి అయితే టిక్కెట్లు ఇవ్వకపోయాని భూములు కొనుక్కోండి ఈసారైనా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని ఆరోపించారు. మంత్రి పదవులు దక్కని వాళ్లను కూడా కొనుగోలు చేసుకోమన్నారని అందుకే అక్కడ రియల్ భూమ్ పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. 

మరోవైపు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హస్తినకు సైతం చేరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి సైతం స్పందించాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని  మార్పు  విషయమై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని తెలిపారు. రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి రాదని తెలిపారు. 

బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం చెలరేగడంతో అమరావతి రైతులు ఆందోళన బాటపట్టారు. తమకు ఇప్పటికే కౌలుడబ్బులు ఇవ్వలేదని అయినా భరిస్తున్నామని తాజాగా రాజధానిని మార్చేస్తున్నట్లు వస్తున్న ఆందోళన నేపథ్యంలో రైతులు ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. అలాగే కేంద్రమాజీ మంత్రి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరిని కలిశారు. రాజధానిపై వస్తున్న వార్తల నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరారు. 

దాంతో రాజధానిపై కేవలం మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రమే చేశారని మరికొందరు మంత్రులు రాజధానిని మార్చే ప్రసక్తే లేదని చెప్తున్నారని వారిలో వారే గందరగోళానికి గురవుతున్నారని విమర్శించారు. రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జగన్ ను కలవాలంటూ రాజధాని రైతులకు తెలిపారు. 

మరోవైపు రాజధాని రైతులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను సైతం కలిశారు. రాజధాని తరలింపు నిర్ణయం విరమించుకోవాలని సూచించారు. రాజధానిపై ఇప్పటికే చాలా నిధులు ఖర్చుపెట్టారని ఆ ధనమంతా వృథా అయిపోతుందన్నారు. 

అలాగే రాజధాని కోసం రైతులు తమ భూములను త్యాగాలు చేశారని చెప్పుకొచ్చారు. వారి త్యాగాలను వృథా చేయనివ్వనని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానులు మారితే మన ఉనికికే ప్రమాదమంటూ హెచ్చరించారు. రాజధానిలో ఏం జరుగుతుందో తాను స్వయంగా ఈనెల 30,31న పర్యటిస్తానని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. 

ఇదిలా ఉంటే రాయలసీమకు చెందిన కీలక నేతలు కీలక ప్రకటనలు చేశారు. మాజీ ఎంపీ చింతా మోహన్ అయితే తిరుపతిని రాజధానిని చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అయితే ఏపీలో నాలుగు రాజధానులు అంటూ కీలక ప్రకటన చేశారు. కాకినాడ, గుంటూరు, విజయనగరం, కడపల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీజీ వెంకటేష్.    

మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను సైతం ఇరకాటంలో నెట్టేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక్కరే మద్దతు పలకగా మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు తలోక వ్యాఖ్యలు చేశారు. 

ఏపీలో హీటెక్కిన వరద రాజకీయాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా వరదలకు రాజకీయ రంగు పులుముకున్నాయి. కృష్ణా వరదలు ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించినవి కావని ప్రభుత్వ విపత్తువల్లే వరదలు సంభవించాయంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పదేపదే ఆరోపించారు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచాలనే కక్షతో పేదోళ్ల ఇళ్లను ముంచేశారని టీడీపీ ఆరోపించింది. అలాగే రాజధానిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించి రాజధానిని తరలించే కుట్ర పన్నిందని టీడీపీ ఆరోపించింది. అందులో భాగంగానే ఈ వరదలను సృష్టించారని ఆరోపించారు. 

వైసీపీ కుట్ర వల్లే కృష్ణా వరదలు సంభవించాయంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా చేసుకుని ఇది ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. 

మరోవైపు చంద్రబాబు ఆరోపణలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ముంపు ప్రాంతంలో రాజధానిని నిర్మిస్తారా అంటూ ప్రజలు తిరగబడతారని భావించి చంద్రబాబు నాయుడు టాపిక్ డైవర్ట్ చేశారని ఆరోపించింది. వరదలు ప్రకృతి వైపరీత్యాల వల్ల వస్తాయని అంతేకానీ వరదలను పార్టీలు, ప్రజలు సృష్టించలేరని ఘాటుగా సమాధానం చెప్పారు. 

అసెంబ్లీ ఫర్నీచర్ మాయం: తీవ్ర ఆరోపణలతో ఆస్పత్రి పాలైన మాజీ స్పీకర్ కోడెల

అమరావతి: ఆగష్టు 19న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమైందన్న వార్తలు రాష్ట్రంలో కలకలం రేపాయి. కోడెల స్పీకర్‌గా ఉన్నప్పుడే ఫర్నిచర్ పోయిందని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూపీ లాగారు. 

అసెంబ్లీ‌కి చెందిన ఫర్నిచర్‌ను సత్తెనపల్లి, నరసరావుపేటకు తరలించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం బట్టబయలవ్వడంతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. అసెంబ్లీ ఫర్నీచర్ తానే వాడుకున్నానని అసెంబ్లీలో భద్రత ఉండదని తన ఇంటికి తరలించానని చెప్పుకొచ్చారు. 
   
అసెంబ్లీ ఫర్నీచర్ తీసుకెళ్లాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తాను అసెంబ్లీ అధికారులకు లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. అసెంబ్లీ అధికారులు వ్యక్తులను పంపిస్తే పంపించి వేస్తామని లేకపోతే ఎంత డబ్బు ఇవ్వాలో చెప్తే ఇచ్చేస్తానని చెప్పుకొచ్చారు. 

కోడెల శివప్రసాదరావు ఫర్నీచర్ ను తానే వినియోగించుకున్నానంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అసెంబ్లీ ఫర్నీచర్ దొంగిలించి పరువు తీసేశారంటూ తిట్టిపోశారు.  

మరోవైపు అసెంబ్లీలో ఫర్నీచర్ ని స్పీకర్ కోడెల దొంగిలిస్తే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాధానాన్ని దోచేశారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. కోడెల దొంగతనం వెనుక చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో విచారణను వేగవంతం చేశారు అధికారులు పోలీసులు. అయితే కోడెల ఇంటికి ఫర్నీచర్ తరలించడంలో కీలక పాత్రలు పోషించారని అనుమానించి చీఫ్ మార్షల్ గణేష్ బాబుపై బదిలీ వేటు వేశారు. ఆయన్ను ఆక్టోపస్ విభాగానికి ట్రాన్స్ ఫర్ చేశారు. 

ఇదిలా ఉంటే కోడెల కార్యాలయంలో ఫర్నీచర్ మాయమైన ఘటనపై కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నీచర్‌ను దారి మళ్లించారని విషయమై అసెంబ్లీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదైంది.

వరుస కేసులు, రాజకీయ విమర్శల తాకిడితో ఈనెల 23న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గుండెపోటుకు గురయ్యారు. అనంతరం కోడెల శివప్రసాదరావును మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. 

సొంత ఇలాఖాలో చంద్రబాబుకు షాక్ ఇచ్చిన సన్నిహితుడు:

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బతగిలింది. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సైకం జయచంద్రారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు.  

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణల సమక్షంలో జయచంద్రారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ జయచంద్రారెడ్డికి కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  ఏపీలో సార్వత్రిక ఎన్నికల పూర్తి అయిన తర్వాత బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టింది. దాంతో ఏపీలోని తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీ గూటికి చేరిపోయారు చేరుతున్నారు కూడా.  

Follow Us:
Download App:
  • android
  • ios