రాజమండ్రి: తెలంగాణలో మాదిరిగానే ఏపీ రాష్ట్రంలో కూడా బీజేపీ విజయం సాధిస్తోందనే  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమాను వ్యక్తం చేశారు.

ఆదివారం నాడు ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో బీజేపీకి సీట్లు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధి విజయం సాధించిందన్నారు.

2024లో ఏపీలో బీజేపీ జనసేన కూటమి విజయం సాధిస్తోందని ఆయన  ధీమాను వ్యక్తం చేశారు. బీసీలకు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
కేంద్రం ఏపీకి 24 లక్షల ఇళ్లను ఇస్తే వైసీపీ సర్కార్ 17 లక్షల ఇళ్లు మాత్రమే తీసుకొందన్నారు.ఇప్పటివరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

త్వరలోనే ఏపీ రాష్ట్రంలోని తిరుపతి ఎంపీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని బీజేపీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఇదే స్థానంలో పోటీకి జనసేన కూడ సిద్దంగా ఉన్నట్టుగా సంకేతాలు ఇస్తోంది.