విశాఖపట్టణం: ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను ప్రభుత్వ భూమిలోనే ఏర్పాటు చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

ఆదివారం నాడు విశాఖపట్టణంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్మాణం కోసం ప్రైవేట్ భూములు సేకరించబోమని  ఆయన తెలిపారు. విశాఖ మన్యలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిని ఇవ్వబోమని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలకు ఒడిశా ప్రభుత్వం అనుమతించినా.. తమ ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వబోదన్నారు.

ఈ నెల 25 వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుగా ఆయన చెప్పారు.  రాష్ట్రంలో ప్రతి పేదవాడికి స్వంత ఇల్లు ఉండాలనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టిందన్నారు.

ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఉపేక్షించబోమన్నారు.  త్వరలోనే సిట్ రిపోర్టును అధికారులు వెల్లడిస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

రాష్ట్రంలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చింది. మూడు రాజధానులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళన ఏడాది పూర్తి చేసుకొన్న విషయం తెలిసిందే.