అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే  69 శాతం పూర్తైనట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. జూలైలో పోలవరం నుండి గ్రావీటీ ద్వారా నీటిని విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం నాడు ఏపీ సీఎం  చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.45 రోజుల తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించినట్టు ఆయన తెలిపారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో అంచనాలకు అనుగుణంగా పనులను పూర్తి చేయలేకపోయినట్టుగా చంద్రబాబునాయుడు చెప్పారు.

యుద్దప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామన్నారు. 60 రోజుల్లోప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ఏం చేయాలనే దానిపై కార్యక్రమాన్ని నిర్దేశించుకొన్నామని ఆయన తెలిపారు. కేంద్రం నుండి సకాలంలో నిధులు రాకపోయినా కూడ  ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా  ఆయన వివరించారు.