అమరావతి: ఈఎస్ఐ స్కాంలో త్వరలో చార్జీషీట్ దాఖలు చేస్తామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ చెప్పారు. 

బుధవారం నాడు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. మరో 9 మందికి సంబంధించి ఈ కేసులో ఆధారాలు సేకరిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. 

అమరావతి మెడికల్స్, తిరుమల మెడికల్స్  కంపెనీలు 2019 తర్వాత మూసివేశారని చెప్పారు. ఈఎస్ఐ స్కాం దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూసిందన్నారు.హెల్త్ టెలీ సర్వీసెస్ స్కీమ్ లో  మాజీ మంత్రి అచ్చెన్నాయుడు  ఓ కంపెనీకి అనుకూలంగా ఆర్దర్ ఇచ్చారని  ఆయన వివరించారు. ఏదైనా కంపెనీకి అనుకూలంగా సిఫారసు చేయడం వేరు, ఆర్డర్ ఇవ్వడం వేరని ఆయన అభిప్రాయపడ్డారు. కాల్ సెంటర్ లో కూడ బిల్స్ కూడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవని ఆయన చెప్పారు. తప్పుడు బిల్లులు పెట్టి డబ్బులు క్లెయిమ్ చేశారన్నారు.

రూ. 233 కోట్లు కోట్ చేసి రూ. 650 కోట్లు తప్పుడు లెక్కలు చూపించారని ఈఎస్ఐ స్కాంపై  తమ దర్యాప్తులో తేలందని ఆయన చెప్పారు. హైద్రాబాద్ నుండి అమరావతికి కార్యాలయాలు తరలింపు సమయంలోని రికార్డులను ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

 2014 నుండి 19 మధ్య కాలంలో మందుల కొనుగోలు విషయంలో దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు. సుమారు 970 కోట్లు బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. మందులు కొనుగోళ్లు విషయంలో రూ. 106 కోట్లు విలువచేసే మందులు కాంట్రాక్టు లేకుండా కొనుగోలు చేశారన్నారు. 

లక్షకు మించి ఏ విధమైన కొనుగోళ్లు టెండర్ ప్రక్రియ తోనే చేయాలనే నిబంధనను తుంగలోతొక్కారన్నారు. అన్ని రకాల నిబంధనలు తుంగలో తొక్కి ధనలక్ష్మి అనే ఉద్యోగిని ద్వారా అప్పటికపుడు బోగస్ కంపెనీ పుట్టించి మందులు సప్లై చేశారని ఆయన వివరించారు. 

 జాయింట్ డైరెక్టర్ జనార్దన్ కడప 400 కోట్లు విలువైన మందులు అవసరంలేనివి కొనుగోళ్లు చేశారని చెప్పారు. లోపాయికారి వ్యవహారాలు చాలా జరిగాయన్నారు. ఈ విషయంలో అచ్చెనాయుడు సంతకాలు చేసినట్లు గుర్తించామని జేడీ రవికుమార్ చెప్పారు. 

తమ విచారణలో తేలిన అంశాలు అన్ని ఫేక్ అని నిర్ధారణ అయిందన్నారు..రూ. 200 ఖర్చయ్యే ఈసీజీ కి  రూ. 480 రూపాయల ఛార్జీ చేశారని ఆయన ఆరోపించారు.

ఈ టెండర్లు లేకుండానే కొనుగోళ్లు చేశారని ఆయన చెప్పారు. ఈ మేరకు సమర్పించిన  బిల్లులు కూడా అన్నీ ఒరిజినల్స్ కావని దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసులో ఇప్పటికే 12 మంది ముద్దాయిలు అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. 
ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ఇప్పటికే అరెస్టయ్యాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా సోకడంతో ఆయనను హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.