శాస్త్రీయ అనుమతులు వచ్చాకే ఆనందయ్య మందు పంపిణీ:ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి
కరోనా కోసం ఆనందయ్య తయారు చేస్తున్న మందుకు శాస్త్రీయ అనుమతులు వచ్చాకే పంపిణీ చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నాడు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనందయ్యను అరెస్ట్ చేశారనే పుకార్లు వ్యాప్తి చెందాయని అలాంటిదేమీ లేదన్నారు.
నెల్లూరు: కరోనా కోసం ఆనందయ్య తయారు చేస్తున్న మందుకు శాస్త్రీయ అనుమతులు వచ్చాకే పంపిణీ చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నాడు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనందయ్యను అరెస్ట్ చేశారనే పుకార్లు వ్యాప్తి చెందాయని అలాంటిదేమీ లేదన్నారు.
తప్పుడు ప్రచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఆనందయ్యను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఆయనను ఎవరూ ఇబ్బంది పెట్టరని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మెడికల్ మాఫియాకు లొంగే ప్రభుత్వం తమది కాదన్నారు. ఆనందయ్య తయారు చేస్తున్న మందు శాస్త్రీయంగా ఎలాంటి ఇబ్బందులు లేవని తేలిన తర్వాత పంపిణీని ప్రారంభిస్తామన్నారు.
also read:నా మందు ఆయుర్వేదమే: ఆనందయ్య
ఈ మందు విషయంలో సీఎం వైఎస్ జగన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ చూపారని ఆయన గుర్తు చేశారు. ఈ మందు హానికరం కాదని ఆయుష్ కమిషనర్ తేల్చారని ఆయన గుర్తు చేశారు. రేపు ఐసీఎంఆర్ టీమ్ ఆనందయ్య తయారు చేసే మందులను పరిశీలించనుందని ఆయన చెప్పారు.ఈ టీమ్ సమక్షంలోనే ఆయన ఈ మందును తయారు చేస్తారని ప్రకటించారు. పూర్తిస్థాయి అనుమతులు వచ్చిన తర్వాతే ఈ మందు పంపిణీ చేస్తామని కాకాని గోవర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు.ఆనందయ్య మందు ఫలితాలు ఇస్తున్నట్టుగా తేలిందన్నారు. అయితే కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వీలైనంత త్వరలో వైద్య నిపుణులు నివేదికను ఇస్తారని ఆయన చెప్పారు.