Asianet News TeluguAsianet News Telugu

సీడబ్ల్యూసీ గైడ్‌లైన్స్ మేరకే నిర్మాణం: పోలవరం ఎత్తుపై ఏపీ అసెంబ్లీలో జగన్

పోలవరం  ప్రాజెక్టును తానే ప్రారంభిస్తానని  ఏపీ సీఎం వైఎస్ జగన్ విశ్వాసం వ్యక్తం  చేశారు.  ఈ ప్రాజెక్టు  గురించి మాట్లాడే  అర్హత టీడీపీకి  లేదన్నారు.  

We Will  Construct  Polavaram Project  As Per  CWC  Guidelines:AP CM YS Jagan lns
Author
First Published Mar 23, 2023, 4:49 PM IST


అమరావతి: సీడబ్ల్యూసీ  గైడ్ లైన్స్  ప్రకారమే  పోలవరం  ప్రాజెక్టు  డ్యామ్  ఎత్తు ఉంటుందన్నారు.  పోలవరం ప్రాజెక్టు  ఎత్తుపై  వస్తున్న అపోహలను  ఎవరూ  నమ్మొద్దని సీఎం జగన్  కోరారు..  ఏపీ అసెంబ్లీలో  పోలవరం ప్రాజెక్టుపై  స్వల్పకాలిక  చర్చకు  ఏపీ సీఎం వైఎస్ జగన్  సమాధానం ఇచ్చారు. 

45.7 మీటర్లు ఎత్తు వరకు  పోలవరం  ప్రాజెక్టు  నిర్మాణం  జరుగుతుందని  సీఎం జగన్ హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ సిఫారసు మేరకు తొలి దశలో  41.15 మీటర్ల ఎత్తు వరకు కడతామని  సీఎం జగన్  చెప్పారు.  పోలవరం ప్రాజెక్టుపై  ఎల్లో మీడియా తప్పుడు  కథనాలు రాస్తుందని  సీఎం జగన్  ఆగ్రహం వ్యక్తం  చేశారు.  పోలవరం ప్రాజెక్టు  విషయమై తాను  ఇటీవల ప్రధానిని కలిసినట్టుగా  ఆయన  వివరించారు. 

పోలవరం ప్రాజెక్టు టీడీపీకి  ఏటీఎంగా మారిందని  ఏపీ సీఎం జగన్ విమర్శించారు.  గతంలో  ఈ విమర్శలు  ప్రధాని మోడీ  చేశారని  సీఎం జగన్  గుర్తు  చేశారు. టీడీపీ ధ్యాస అంతా  డబ్బుల మీదేనని  ఆయన  చెప్పారు.  

టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్లే డయాఫ్రంవాల్ దెబ్బతిందన్నారు.  స్పిల్ వే  పనులు  అసంపూర్ణంగా  వదిలేశారని  ఆయన  విమర్శించారు.  చంద్రబాబు  సర్కార్  స్పిల్ వే  పనులను వదిలేసి  కాఫర్ డ్యాం  పనులను  మొదలు పెట్టారని  ఆయన  చెప్పారు. బుద్ది ఉన్నవాడెవడైనా  ఇలా  చేస్తారా అని  జగన్  ప్రశ్నించారు. అప్రోచ్ చానెల్  పనులను కూడా  పూర్తి  చేయలేదని  ఏపీ సీఎం జగన్  గుర్తు  చేశారు. 

 టీడీపీ ప్రభుత్వ  హయంలో  పోలవరం  ఒక్క అడుగైనా  ముందుకు కదిలిందా  అని  ఆయన ప్రశ్నించారు.  గత ఐదేళ్లలో  చంద్రబాబు నాయుడు  పోలవరం నిర్మాణం  కోసం  ఏం  చేశారని  ఆయన  ప్రశ్నించారు. పనులు  పూర్తి చేయకుండానే  పోలవరాన్ని తానే  పూర్తి చేశానని  చంద్రబాబు చెప్పుకుంటున్నారని  ఏపీ సీఎం  విమర్శించారు.     పోలవరం అని పలికే అర్హత  టీడీపీకి  లేదని  ఏపీ సీఎం జగన్  విమర్శించారు.  దోచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు విధానంగా  జగన్  విమర్శలు  చేశారు.  సీఎంగా  ఉన్నప్పుడు  ప్రాజెక్టు  పూర్తి చేయకుండా  చంద్రబాబునాయుడు గాడిదలు కాశారా అని  ఆయన  ప్రవ్నించారు. 

 తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం  పనులను  అన్నింటిని  వేగంగా  పూర్తి  చేశామన్నారు.  దిగువ కాఫర్ డ్యాం  పనులను కూడా విజయవంతంగా  పూర్తి  చేసినట్టుగా  సీఎం జగన్ వివరించారు. 

పోలవరం అంటే వైఎస్ఆర్ అని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.ఈ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారన్నారు. వైఎస్ఆర్ కొడుకుగా  ఈ ప్రాజెక్టును ప్రారంభించేది తానేనని  ఆయన  విశ్వాసం వ్యక్తం  చేశారు. పోలవరం  ప్రాజెక్టులో  రివర్స్ టెండరింగ్  ద్వారా  రూ. 800 కోట్లు  ఆదా చేశామన్నారు. గోదావరిలో గత 100 ఏళ్లలో  రెండో అతి పెద్ద  వరద వచ్చినా  స్పిల్ వే ద్వారా కట్టడి  చేసినట్టుగా  సీఎం జగన్ వివరించారు.  స్పిల్ వే  పూర్తి  చేసి  48 గేట్లు  కూడ ఏర్పాటు  చేసినట్టుగా  సీఎం జగన్  గుర్తు  చేశారు.ఈ ప్రాజెక్టు  కింద  నిర్వాసితుల  సంక్షేమం కోసం  అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని  సీఎం జగన్  వివరించారు.  ప్రస్తుతం గోదావరి డెల్టాకు  నీరు అందించే   పరిస్థితి నెలకొందన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios