తిరుపతి: తెగింపు కలిగిన నాయకులు, జన సైనికులు తమ పార్టీలో ఉన్నారని... ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లో అయినా వారికిఅండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్, ఆపైన ప్రధాని మోదీ ఉన్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మోడీ నాయకత్వంలో  కచ్చితంగా మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని... అన్ని విధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం రత్నప్రభ లాంటి ఎంపీ రాష్ట్రానికి అవసరమని... ఆమె విజయం కోసం ఈ పది రోజులు శ్రమించి కష్టపడండన్నారు.  పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే అందరూ బాధ్యతగా పని చేయాలి అని నాదెండ్ల సూచించారు. 

 తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో నాదెండ్ల మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలను నిజాయతీగా నిర్వహించలేక పారిపోతున్న వైసీపీ నేతలు ఇతరుల గురించి మాట్లాడుతున్నారని నాదెండ్ల విమర్శించారు. అధికార పార్టీకి దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తిరిగి నోటిఫికేషన్ ఇప్పించి కొత్తగా నామినేషన్లు వేసుకునే అవకాశం కల్పించాలన్నారు. 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ ఇస్తే జనసేన-బీజేపీ కూటమి తరఫున ఎంతమంది అభ్యర్ధులను పోటీకి నిలబెడతామో, ఎలా గెలుస్తామో  చూపెడతాం అని సవాల్ విసిరారు. 14 నెలల క్రితం జరిగిన నామినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ దొడ్డిదారిన నోటిఫికేషన్ ఇచ్చి మూడు రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తున్నారన్నారు.  ఇప్పటికే ఈ వ్యవహారంపై అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కోర్టులో న్యాయపోరాటానికి దిగామని... అక్కడ అయినా న్యాయం జరుగుతుందని ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ధర్మాసనం అనుకూల తీర్పు ఇస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు నాదెండ్ల పేర్కొన్నారు. 

read more   పదవులపై ఆశ లేదు.. కానీ సీఎం పదవిస్తే ఎక్కువే చేయగలను: మనసులో మాట చెప్పిన పవన్

''జనసేన నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఎన్నిక వచ్చినా సిద్ధంగా ఉండాలి. బాధ్యతగా వ్యవహరించాలి. పవన్ కళ్యాణ్ మన ప్రాంత భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంతో ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఆ పార్టీ అగ్రనాయత్వంతో మాట్లాడినప్పుడు పవన్ కి ఆ నమ్మకం కలిగింది. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం'' అని తెలిపారు. 

''మన ప్రాంతానికి మేలు జరగాలి, పెట్టుబడులు రావాలి. ఇప్పటికే ఎంతో మంది యువత ఉపాధి కోల్పోయారు. వారందరికీ ఉపాధి రావాలి. ప్రస్తుత పాలకులు మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అసలు ఏ మాట మీద నిలబడ్డారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇంటింటికీ రేషన్ ఇవ్వలేదు. చేస్తున్న ప్రతి కార్యక్రమం ఒక కుటుంబానికి లబ్ది చేకూరే విధంగా చేపడుతున్నారు. రోజుకు రూ. 500 కోట్లు అప్పు తెచ్చి ఖజానాని డొల్ల చేశారు. మధ్యం అమ్ముకున్నారు.  ఇసుక అమ్ముకున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న బిల్డింగులు కూడా అమ్ముకుంటారు. ఇటువంటి ముఖ్యమంత్రి మనకి అవసరమా? మార్పు రావాలి. మార్పు రావాలి అంటే  మీలో ఆ బాధ్యత పెరగాలి. ప్రతి ఒక్కరు పార్టీ కోసం నిలబడి పని చేయాలి. ఓటు వేయాలి. వేయించాలి'' అని ప్రజలకు, పార్టీ శ్రేణులకు సూచించారు. 

''మన బలిజ సోదరులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గరకు ఆ సమాచారం వచ్చింది. కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. అధికార పక్షం వేధింపులకు లోనవుతున్న సోదరులందరికీ నూటికి నూరుశాతం అండగా నిలబడతాం. మొన్నటికి మొన్న మైసూరివారి పల్లి ప్రజలు మహిళా సర్పంచ్ ఎన్నుకుంటే ఇప్పుడు అక్కడి ఎంపీటీసీ అభ్యర్ధి మీద కావాలని అట్రాసిటీ కేసు పెట్టారు. మన నాయకులంతా బలంగా నిలబడ్డారు. అవసరం అయితే జైలుకి వెళ్తాంగానీ ఎంపీటీసీ నామినేషన్ ఉపసంహరించుకోబోమన్నారు'' అని నాదెండ్ల తెలిపారు.