అమరావతి: 13 జిల్లాల్లో ఏం చేశామో చెప్పగలను... 13 నెలల్లో వైసీపీ ఏం చేసిందో చెప్పగలదా  అని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. 

సోమవారం నాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన తర్వాత 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టామన్నారు. రామాయపట్నం, బందర్ , కాకినాడ, భావనపాడు పోర్టులకు నాంది పలికనట్టుగా ఆయన గుర్తు చేశారు.  గోదావరి మిగులు జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని చూసినట్టుగా ఆయన చెప్పారు.

నదుల అనుసంధానికి  శ్రీకారం చుట్టామన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి.. కానీ, ఈ ప్రాజెక్టును ఇప్పుడెలా ఇబ్బంది పడుతోందో చూస్తున్నామన్నారు. 62 ప్రాజెక్టులకు నాంది పలికినట్టుగా ఆయన గుర్తు చేశారు. 

తమ ప్రభుత్వం 23 ప్రాజెక్టులను పూర్తి చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు గమనించాలని ఆయన కోరారు. 

16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇవన్నీ పూర్తైతే 32 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
ఐటీ, ఫార్మా, టూరిజం, టెక్స్ టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు శ్రీకారం చుట్టినట్టుగా ఆయన తెలిపారు. 

ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానంలో నిలిచినట్టుగా ఆయన తెలిపారు.  అన్ని జిల్లాల అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్లినట్టుగా ఆయన చెప్పారు. ఏది నిజమో ఏది అసత్యమో ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు. 13 జిల్లాల అభివృద్దికి ఏమేం చేశామో చెబుతున్నామన్నారు. ఏ జిల్లాలో ఏం చేశామో తాను చెప్పగలనని ఆయన స్పష్టం చేశారు. 

రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు గాను ప్రయత్నాలు చేశామన్నారు. అన్ని ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. 
విశాఖలో హుదూద్ తర్వాత రూ. 700 కోట్లతో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరాను చేశామన్నారు. మెట్రో, ఎయిర్ పోర్టులకు శ్రీకారం చుట్టినట్టుగా ఆయన  తెలిపారు. 

ఉత్తరాంధ్రకు ఎవరేం చేశారో చెప్పాలన్నారు. 13 నెలల్లో ఉత్తరాంధ్రలో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కొత్త పరిశ్రమలు తెచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఏది అభివృద్ధో, ఏదో విధ్వంసమో తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

అనంతపురానికి నీళ్లు ఇచ్చినందునే కియా పరిశ్రమ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. 2014 తర్వాత రాష్ట్రాన్ని రెండంకెల అభివృద్ధికి చేర్చామన్నారు. విధ్వంసం కావాలా, అభివృద్ధి కావాలో  ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన ప్రజలను కోరారు