పోలవరంపై ఎన్జీటీ తీర్పుపై సుప్రీంలో జగన్ సర్కార్ సవాల్: అన్ని పిటిషన్లను విచారిస్తామన్న కోర్టు
పోలవరంపై ఏపీ ప్రభుత్వానికి రూ. 120 కోట్లు జరిమానా విధిస్తూ ఎన్జీటీ తీర్పు ఇచ్చింది.ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇతర పిటిషన్లను కూడా కలిపి ఒకేసారి విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ఇవాళ ప్రకటించింది.
న్యూఢిల్లీ: పోలవరంపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై దాఖలైన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయమై పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానాను విధించింది. అయితే ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం నాడు సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లతో పాటు మరికొందరు కూడా పోలవరం నిర్మాణంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నీ ఒకేసారి విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ఇవాళ తెలిపింది.
పర్యావరణ నష్టానికి ఎందుకు బాధ్యత వహించరని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికీ కూడా ప్రాజెక్టు నిర్మాణంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఏపీ ప్రభుత్వంపై ఆరోపించారు ఇతర పిటిషనర్లు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 50 వేల మంది ముంపునకు గురయ్యారని కూడా ఆ పిటిషనర్ల తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.
also read:పోలవరం బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయాలి: కేంద్రానికి తెలంగాణ లేఖ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ రాష్ట్రం అభ్యంతరాలను పట్టించుకోకుండా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని నాలుగు రోజుల క్రితం తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పై కూడా అధ్యయనం చేయాలని కోరింది. పోలవరం ప్రాజెక్టు 50 లక్షల డిశ్చార్జ్ కెపాసిటీని పెంచుతూ నిర్మాణాన్ని చేపట్టారని తెలంగాణ ఆరోపిస్తుంది.