కాకినాడ: తూర్పుగోదావరి డీఆర్‌సీ సమావేశం రాసాభాసగా ముగిసింది. వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు.దీంతో సమావేశానికి అర్ధాంతరంగా ముగించారు. మాజీ డీప్యూటీ సీఎం, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు సోమవారం నాడు తూర్పుగోదావరి డీఆర్‌సీ సమావేశంలో వేడి పుట్టించాయి.

టిడ్కో ఇళ్ల విషయంలో అవినీతి జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు సమావేశంలో కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 

టిడ్కో ఇళ్ల విషయంలో ఎవరు అవినీతి చేశారో చెప్పాలని ఆయన పట్టుబట్టారు. డబ్బులు ఎవరు వసూలు చేశారో చెప్పాలని కోరారు. 

ఈ విషయమై  ఎంపీ సుభాష్ చంద్రబోస్ తో ఆయన వాగ్వావాదానికి దిగారు. టిడ్కో ఇళ్లు టీడీపీ హాయంలో నిర్మించినట్టుగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ చెప్పారు.

టీడీపీ పేరును ప్రస్తావించడంతో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఆరోపణలను నిమ్మకాయల  చినరాజప్ప తప్పుబట్టారు.

టిడ్కో ఇళ్ల విషయంలో అవినీతి జరిగిందని బోస్ ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామో చెప్పాలని ఆయన కోరారు. బోస్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో సమావేశంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.

సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో  అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించారు. మంత్రి కన్నబాబు సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.