పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉండగా పోలవరం పూర్తవడం అసాధ్యమని సంచలన కామెంట్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉండగా పోలవరం పూర్తవడం అసాధ్యమని సంచలన కామెంట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్మాణ పనులపై శ్వేతపత్రం ప్రకటించాలని ఉండవల్లి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోదావరికి వచ్చిన వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరని ప్రశ్నించారు.
కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల వచ్చిన నష్టానికి బాధ్యులెవరో నిర్థారించాలని, తప్పు ఎవరిదో సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాలు చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పిన మంత్రి అంబటి రాంబాబుకు ఉండవల్లి అరుణ్‌కుమార్ అభినందనలు తెలిపారు. ఆయన చెప్పింది నిజం అని అన్నారు. తాను బతికి ఉండగా పోలవరం నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని తాను మానసికంగా సిద్దపడ్డానని కామెంట్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని.. ప్రాజెక్టు పూర్తికాకముందే వల్ల భద్రాచలం మునిగిపోతుందని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలంటే.. నిర్వాసితులకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
