విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనను తీవ్రతరం చేశారు. స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ముట్టడికి వేలాది మంది ఉద్యోగులు, కార్మిక సంఘాల కార్యకర్తలు హాజరు కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను విధులకు హాజరుకాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ కారు దిగకుండా చుట్టుముట్టారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయనను కారు దిగకుండా అడ్డుకున్నారు.

అనంతరం సీఐఎస్ఎఫ్ బలగాలు అక్కడికి చేరుకుని ఆయనను సురక్షితంగా లోపలికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన రోడ్డుపైనే పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఐదు గంటల నిర్బంధం తర్వాత అధికారులను కార్మికులు వదిలిపెట్టారు.

Also Read:విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం: మోడీ అపాయింట్‌మెంట్ కోరిన జగన్

అయితే కేంద్రానికి తొత్తులుగా మారిపోయారని.. ఏ విషయాలను కార్మిక సంఘాలకు లీక్ కాకుండా వ్యవహరిస్తున్నారని అధికారులపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఆందోళన కారణంగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.

అనేక వాహనాల టైర్లలో ఆందోళనకారులు గాలి కూడా తీసేశారు. ఫైనాన్స్ డైరెక్టర్ వాహనం నెంబర్ ప్లేట్లను సైతం ధ్వంసం చేశారు. అయితే కార్మిక సంఘాలు కార్మికులను నచ్చజెప్పడంతో వారు శాంతించారు. ఉద్యమం భవిష్యత్ కార్యారణపై సాయంత్రం కార్మిక జేఏసీ సమావేశం కానుంది.