విశాఖలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేశ్ కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. నిందితులు పల్లపు ప్రసాద్, ప్రతాప్ రెడ్డిలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వ్యాపార లావాదేవీలు, రైస్ పుల్లింగ్ వ్యవహారాలే కిడ్నాప్‌కు ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇందుకు సంబంధించిన వివరాలను విశాఖ పోలీస్ కమీషనర్ ఆర్ కే మీనా మీడియాకు వెల్లడించారు. సురేశ్‌ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. కత్తి, తుపాకీతో సురేశ్‌ను బెదరించారని.. డబ్బులు లేవని బంగారం ఉందని అతను కిడ్నాపర్లకి చెప్పారని సీపీ తెలిపారు.

సురేశ్ తన భార్యకి ఫోన్ చేసి బంగారం తీసుకు రమ్మన్నారని.. అతని భార్య బంగారం తీసుకువచ్చిన తర్వాత భార్యాభర్తలు గొడవ పడ్డారని చెప్పారు. అదే సమయంలో సురేశ్ కొడుకు డయల్ 100కి ఫోన్ చేయడం పోలీసులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పారిపోయారని మీనా వెల్లడించారు.

ఈ కేసులో పల్లపు ప్రసాద్, ప్రతాప్ రెడ్డిలను అరెస్ట్ చేశామని.. వీరితో సహా మొత్తం ఏడుగురి పాత్రను గుర్తించామని సీపీ తెలిపారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. అరెస్ట్ అయిన వారిపై ఇప్పటికే రైస్ పుల్లింగ్‌తో పాటు పలు కేసులు ఉన్నాయని కమీషనర్ చెప్పారు.

నిందితులలో కొంతమందితో సురేశ్‌కి రైస్ పుల్లింగ్ ద్వారా పరిచయం ఉందని.. ఇదే సమయంలో బాధితుడిపై కూడా కేసులు ఉన్నాయని ఆర్కే మీనా వెల్లడించారు. కేసులతో పాటు డబ్బులు వున్న వ్యక్తిని కిడ్నాప్ చేస్తే త్వరగా డబ్బులు వస్తాయని నిందితులు ఊహించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్‌పై మూడు కేసులు ఉన్నాయని.. మరో నిందితుడు ప్రతాప్‌ రెడ్డిపై నాలుగు కేసులు ఉన్నాయని.. గతంలో ప్రసాద్ కూడా ఈ రైస్ పుల్లింగ్ వ్యవహారంలో కిడ్నాప్‌కు గురై మోసపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడని ఆర్కే మీనా చెప్పారు.