వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, 14 రోజుల రిమాండ్...
వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, కిడ్నాప్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు.

కడప : వైసిపి నేత వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. అతడిని ఒక కిడ్నాప్ కేసులో పోలీసులు పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అతనితోపాటు అతని కుటుంబ సభ్యులు ఐదుగురి మీద కూడా కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నమోదు చేశారు. వీరందరినీ జైలుకు పంపించారు. అసలు ఏం జరిగిందంటే.. దస్తగిరి బంధువుల అమ్మాయి వేరే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇది నచ్చని వీరు ఆ అమ్మాయిని బలవంతంగా ఇంటికి తీసుకు వెడుతుంటే.. పోలీసులు కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు.
ఈ కిడ్నాప్ ఆరోపణలు.. అరెస్టు వెనక కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుట్ర ఉందని.. దస్తగిరి భార్య షబానా ఆరోపిస్తున్నారు. ఈ ఈ మేరకు ఆమె ఎర్రగుంట పోలీస్ స్టేషన్ ఎదురుగా కన్నీటి పర్యంతమయ్యారు. ఇమాంబి అనే దస్తగిరి బంధువుల అమ్మాయి ఓ ఎస్సీ యువకుడిని ప్రేమించింది. లక్ష్మీనారాయణ అనే ఆ యువకుడితో నెలరోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయింది.
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి 22 మందికి గాయాలు..
తాజాగా గతవారమే ఇద్దరు లక్ష్మీనారాయణ ఇంటికి తిరిగివచ్చారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో దస్తగిరి సహాయం కోరారు. వారందరితో కలిసి సోమవారం మధ్యాహ్నం ఎర్రగుంట్లకు చేరుకున్న దస్తగిరి.. లక్ష్మీనారాయణ ఇంట్లో నుంచి బలవంతంగా కారులో ఎక్కించుకొని బయలుదేరారు. వెంటనే లక్ష్మి నారాయణ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకు వెళుతున్నట్లు సమాచారం రావడంతో డిఎస్పీ నాగరాజు కడప సమీపంలో చెన్నూరు దగ్గర దస్తగిరి వెళుతున్న కారును ఆపి అతడిని అదుపులోకి తీసుకున్నారు. దస్తగిరితో పాటు మరో ఐదుగురు కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరికి పదిమంది పోలీసులు ఎస్కార్ట్ ఉన్నారు. వారందరి కళ్ళు గప్పి అమ్మాయిని తీసుకువెళ్లాడు.
అంతేకాదు లక్ష్మీనారాయణ కుటుంబాన్ని కులం పేరుతో దూషించాడు. ఈ రెండు కారణాలతో దస్తగిరిని అరెస్టు చేసామని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని డిఎస్పి నాగరాజు మీడియాకు తెలిపారు. దస్తగిరిని, ఆయనతోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులను కమలాపురం మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ వీరికి 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో వీరందరిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు.