Asianet News TeluguAsianet News Telugu

ఇది వైఎస్సాసుర రక్తచరిత్ర... వివేకాని వేటాడింది సొంతింటి గొడ్డలే: నారా లోకేష్ సంచలనం

ఫ్యాక్ష‌న్ మీ బ్ల‌డ్ గ్రూప్‌... అరాచ‌కాల‌కు మీ ఫ్యామిలీ కేరాఫ్ అడ్ర‌స్‌... దాడులు, దౌర్జ‌న్యాలు, క‌బ్జాల‌పై పేటెంట్ హక్కులు మీకే అంటూ వైఎస్ కుటుంబం, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు నారా లోకేష్. 

viveka murder... nara lokesh sensational comments on ys family and cm jagan
Author
Amaravati, First Published Aug 13, 2021, 3:46 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. నారాసుర రక్తచరిత్ర అంటూ గతంలో అబద్దపు వార్తలను ప్రచురించిన సాక్షి పత్రిక  వైఎస్సాసుర కుటుంబ‌ ర‌క్త‌చ‌రిత్ర‌ని ఎలా అచ్చేస్తుందో చూస్తానని అన్నారు. సొంత కుటుంబసభ్యులకే మాజీ మంత్రి వివేకాను చంపారనడానికి సిబిఐ విచారణ సాగుతున్న తీరే నిదర్శనం అన్నారు లోకేష్. 

''కోట్ల‌ కోసం సొంత‌ బాబాయ్‌పై గొడ్డ‌లి వేటు వేసి... మీ చేతికంటిన నెత్తురుని చంద్ర‌బాబుకి ఎలా పూశారు జ‌గ‌న్‌రెడ్డి గారూ? ర‌క్త‌సంబంధీకుడైన సొంత‌ బాబాయ్‌పై గొడ్డ‌లివేటు వేసి ఓట్ల కోసం నారాసుర‌ ర‌క్త‌చ‌రిత్ర అంటూ అదే గొడ్డ‌లిని గ్రాఫిక్స్‌లో చంద్ర‌బాబు చేతిలో పెట్టి మ‌రీ విష‌పుత్రిక సాక్షిలో అచ్చేయించారు. అయినా మీ త‌ర‌త‌రాల వైఎస్సాసుర‌ ర‌క్త‌చ‌రిత్ర అంతా నేరాల‌మ‌యం అని మ‌రోసారి సీబీఐ ద‌ర్యాప్తుతో తేట‌తెల్ల‌మైంది'' అని లోకేష్ మండిపడ్డారు.

 ''ఫ్యాక్ష‌న్ మీ బ్ల‌డ్ గ్రూప్‌. అరాచ‌కాల‌కు వైఎస్ ఫ్యామిలీ కేరాఫ్ అడ్ర‌స్‌. దాడులు, దౌర్జ‌న్యాలు, క‌బ్జాల‌పై వైఎస్ కుటుంబానికి పేటెంట్ హ‌క్కులున్నాయి. వైఎస్ వంశ ర‌క్త‌చ‌రిత్ర‌కి తాజా సాక్ష్యం అదే కుటుంబానికి చెందిన‌ వివేకానంద‌ రెడ్డి హ‌త్య‌'' అని అన్నారు. 

read more  వైఎస్ వివేకా హత్య కేసు: ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు శంకర్ రెడ్డి విచారణ

'' వైఎస్ కుటుంబ‌స‌భ్యులు ఒక్కొక్క‌రినీ సీబీఐ పిలిపిస్తుంటే..అది ఇంటి గొడ్డ‌లేన‌ని... సొంతింటి వేట‌కొడ‌వ‌లే వివేకాని వేటాడింద‌ని స్ప‌ష్టం అవుతోంది. డ‌బ్బు, ఆధిప‌త్యం, గ‌నులు, అక్ర‌మాల కోసం సొంత బాబాయ్‌నే చంపుకున్న వైఎస్సాసుర కుటుంబ‌ ర‌క్త‌చ‌రిత్ర‌ని నీ దొంగ పేప‌ర్ సాక్షిలో ఎలా అచ్చేస్తావో చూస్తాను జ‌గ‌న్‌రెడ్డీ!'' అంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

68 రోజులుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ ఈ మధ్య దూకుడు పెంచింది. ఇవాళ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ విచారించింది. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో  పనిచేసే రఘునాథ్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కీలక సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. మరోవైపు  డాక్టర్ భరత్ రెడ్డిని కూడ సీబీఐ అధికారులు విచారించారు.ఈ హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు కీలకమైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. 

2019 మార్చి 14వ తేదీ రాత్రి తన ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి పలువురి అనుమానితుల పేర్లను కూడ సీబీఐకి అందించింది. అయితే గోవాలో సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేసిన తర్వాత  ఈ కేసులో కీలక సమాచారాన్ని సేకరించారని ప్రచారం సాగుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios