వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. తాజాగా.. వైసీపీ అధినేత జగన్ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. శంకర్ రెడ్డితోపాటు నాగప్ప.. అతని కుమారుడు శివను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. వివేకానంద రెడ్డి హత్యకు ఆస్తి తగాదాలే ముఖ్యకారణమా అనే అనుమానం లేవనెత్తోంది. మరోవైపు అనుచరులే హత్య చేశారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. సిట్ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పరమేశ్వర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అనే వారు సూత్రధారులైతే.. పాత్రధారిగా చంద్రశేఖర్‌రెడ్డి అండ్‌ గ్యాంగ్‌ ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇప్పటి వరకు 40 మందిని రహస్య ప్రదేశాల్లో విచారిస్తున్నారు. 

కేసు కొలిక్కి వస్తుండటంతో ఒకటి రెండురోజుల్లోనే అధికారికంగా అరెస్ట్‌లు చూపించే అవకాశం ఉన్నట్లు పోలీస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. హత్య జరిగిన రాత్రి 11.30గంటల ప్రాంతంలో చిన్న అనే వ్యక్తికి చెందిన స్కార్పియో వాహనంలో చంద్రశేఖర్‌రెడ్డి పులివెందులలో తిరిగినట్లు సీసీ ఫుటేజీల్లో పోలీసులు గుర్తించినట్లు సమాచారం.